- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వేగవంతం చేయాలి.. విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో భట్టి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వివరించారు. శుక్రవారం బెంగళూరులో కేంద్ర విద్యుత్ మంత్రుల ఆధ్వర్యంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల (Power Ministers' Conference) విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ రంగ అభివృద్ధిపై చర్చించారు. విద్యుత్ రంగంలో రాష్ట్ర పురోగతి, ప్రణాళికలను వివరిస్తూ, ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచడం, పరిశుభ్ర ఇంధన మార్గంలో వేగంగా సాగేందుకు తగిన కార్యాచరణలపై రాష్ట్రాలు, కేంద్రం కలిసి చర్చించడానికి ఈ సదస్సు విలువైన వేదికగా నిలిచిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని అంతర్గత విద్యుత్ ప్రసార నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ద్వారా పెరుగుతున్న డిమాండ్‌కి తగిన విధంగా వివిధ విద్యుత్ వనరుల సమన్వయానికి అనుకూలంగా చర్యలు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణలో ప్రసార లైన్లు, ట్రాన్స్‌ఫర్మేషన్ సామర్థ్యంలో గణనీయమైన విస్తరణపై ప్రణాళికలను వివరించారు. (Electric vehicle charging stations) ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేయాల్సిన అవసరాన్ని సదస్సులో భట్టి చర్చించారు. ఛార్జింగ్ స్టేషన్లకు కనెక్షన్ ప్రక్రియను సులభతరం చేయడంపై తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థ అభివృద్ధికి లక్ష్యాలను నిర్దేశించారు. విద్యుత్ గ్రిడ్‌లో సైబర్ భద్రతా చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రతిస్పందన సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలు చర్చించారు.
ఏ పరిస్థితుల్లోనైనా నాణ్యమైన మరియు నమ్మదగిన విద్యుత్ సరఫరా నిర్ధారించేందుకు బలమైన వ్యవస్థలు అవసరమన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు తెలంగాణ రాష్ట్రం చూపిస్తున్న ప్రొయాక్టివ్ దృష్టికోణాన్ని డిప్యూటీ సీఎం ప్రధానంగా ప్రస్తావించారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, పంప్‌డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరచే ప్రణాళికలపై కూడా వివరించారు. రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయడం ద్వారా జాతీయ ఇంధన లక్ష్యాలను సాధించవచ్చన్న విషయం ఈ సదస్సులో స్పష్టమైంది. సమావేశంలో కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్, కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యస్సో నాయక్, కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి కే.జే జార్జ్, తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.






