మహిళ పోలీస్ కాదు ‘ పోలీస్’ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-22 16:31:42  IST  )

పోలీస్ నియామక సమయంలో లేని లింగ వివక్ష విధుల్లో చూపడం సరైనది కాదని, మహిళ పోలీసులో మహిళా అనే పదాన్ని తొలగించాలన్న సిఫారసు మంచి ఆలోచనని , రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ సిఫారసుతో తాను ఏకీభవిస్తున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

మహిళ పోలీస్ కాదు ‘ పోలీస్’ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X
  • మహిళా పోలీస్ సిఫారసుల అమలుకు సిద్ధం
  • సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • శాంతి భద్రతల సంరక్షణలో రాష్ట్రం నెంబర్ వన్
  • ఉమెన్ ఇన్ పోలీస్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఆర్‌బీవిఆర్ఆర్ పోలీస్ అకాడమీలో మూడు రోజుల పాటు జరిగిన వుమెన్ ఇన్ పోలీస్ కాన్ఫరెన్స్
  • రాష్ట్ర వ్యాప్తంగా హజరైన మహిళ పోలీస్ సిబ్బంది

దిశ, తెలంగాణ బ్యూరో : పోలీస్ నియామక సమయంలో లేని లింగ వివక్ష విధుల్లో చూపడం సరైనది కాదని, మహిళ పోలీసులో మహిళా అనే పదాన్ని తొలగించాలన్న సిఫారసు మంచి ఆలోచనని , రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ సిఫారసు తో తాను ఏకీభవిస్తున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మహిళా పోలీస్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మూడు రోజుల సదస్సు ద్వారా మహిళా సిబ్బంది సంక్షేమానికి చేసే సిఫారసులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. రాజేంద్ర నగర్ లోని ఆర్‌బీవిఆర్ఆర్ పోలీస్ అకాడమిలో డైరక్టర్ డీజీ అభిలాష బిష్త్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన వుమెన్ ఇన్ పోలీస్ కాన్ఫరెన్స్ కార్యక్రమం ముగింపులో ముఖ్య అతిధిగా డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం పాల్గొన్నారు. పోలీసులు తమ అభిప్రాయలను ఆయన ముందు వెల్లడించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మహిళా సిబ్బంది వ్యక్తిగత అవసరాలు, యూనిఫామ్ అవసరాలు అన్ని అమలు చేయదగినవే అవేమి గొంతెమ్మ కోరికలు కాదని అన్నారు. మహిళా పోలీస్ సిబ్బంది సమస్యలపై త్వరితగతిన కమిటీ వేసి సైంటిఫిక్ గా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజల అవసరాలను తీర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే సిబ్బంది అవసరాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర సిబ్బంది అవసరాలు తీర్చి ప్రజల జీవన స్థితిగతులను ఏ రకంగా మార్చగలం అన్న భావనతో మానవీయ కోణంలో పరిపాలించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్ రాష్ట్రంలో ఉందన్నారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే, పెట్టుబడులు రావాలి అంటే శాంతి భద్రతలు బాగుండాలి, అప్పుడే పెట్టుబడులు వస్తాయని తెలిపారు. అంకిత భావంతో పనిచేసే పోలీసు సిబ్బంది ఉన్నప్పుడే అది సాకారం అవుతుంది అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు, ఉత్సవాలు జరిగాయి పోలీసులు జీవితాలను పనంగా పెట్టి చిన్న దుర్ఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు.

శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందన్నారు. పోలీసు సిబ్బంది శ్రమ రాష్ట్ర అభివృద్ధికి మూలం అన్నారు. పోలీసు సిబ్బంది వ్యక్తిగత సమస్యలతో పాటు శాఖపరమైన కార్యాలయాల భవనాలు, పోలీస్ స్టేషన్ లు, సిబ్బంది క్వార్టర్స్ వంటి సమస్యలకు సంబంధించి ప్రతిపాదనలు తీసుకురావాలని పోలీసు అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. రాష్ట్రంలో విద్యా విధానంలో కొత్త ఒరవడిని ప్రజా ప్రభుత్వం సృష్టిస్తుందని తెలిపారు. 25 ఎకరాల విస్తీర్ణంలో, 200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక్కో స్కూల్ ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఒకేసారి 104 పాఠశాలలు నిర్మిస్తున్నాం అన్నారు. పోలీస్ సిబ్బంది పిల్లలు చదువుకునేందుకు ఒక యంగ్ ఇండియా ఇప్పటికే ప్రారంభించామని అది బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం తెలిపారు.

హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహిళా పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు. పోలీస్ శాఖలోని ట్రాఫిక్, శాంతిభద్రతలు ఇంటెలిజెన్స్ అన్ని విభాగాల్లో మహిళా సిబ్బంది రాణిస్తున్నారని అన్నారు. డీజీపీ డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మహిళా పోలీస్ సిబ్బంది కోసం దేశంలోనే మొదటిసారిగా మూడు రోజుల సదస్సు నిర్వహించిందని అన్నారు. ఈ మహిళా సదస్సులో వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తానన్నారు. ఈ రకమైన సదస్సులు నిర్వహించి ఇప్పటికే దేశంలో ప్రథమ స్థానం పొందిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ భవిష్యత్తులోనూ అగ్రస్థానంలో నిలబడాలని ఆకాంక్షించారు. సదస్సులో జరిగిన చర్చల వివరాలను పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ వివరించారు. వివిధ రకాల అంశాలపై సీనియర్ మహిళా పోలీస్ అధికారులతో బృందాలుగా ఏర్పడి చర్చించారని వాటిని ప్రభుత్వానికి పంపుతామని తెలియజేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా, అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, తమిళనాడు రాష్ట్ర పోలీసు అధికారి బాలనాగదేవి, ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ , పోలీస్ అకాడమీ అధికారులు , సిబ్బంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళా పోలీస్ సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story