- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా సంఘాల ఖాతాల్లో రూ. 304 కోట్లు జమ.. అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క కాన్ఫరెన్స్
రాష్ట్రంలోని 3.50 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ. 304 కోట్ల వడ్డీలేని రుణాలను పంపిణీ చేయనున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 3.50 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ. 304 కోట్ల వడ్డీలేని రుణాలను పంపిణీ చేయనున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ చీరెల పంపిణీ పురోగతి, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వడ్డీలేని రుణాల పంపిణీ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడో విడత వడ్డీ లేని రుణాలను రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధిత శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు తప్పక హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న ఈ వడ్డీ లేని రుణాలతో మహిళల్లో ఒక ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం ఏర్పడిందన్నారు. ఈ వడ్డీ లేని రుణాల మొత్తం నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నందున ఎవరెవరికి ఎంత మొత్తం అందిందో సభ్యులకు స్పష్టంగా తెలియ చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా సాగుతుంది, ఈ చీరల నాణ్యత, డిజైన్ పట్ల మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తమకి నాణ్యమైన ఇందిరమ్మ చీరలను అందించడం పట్ల రాష్ట్రం లోని మహిళలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నాణ్యమైన చీరలను అందించడంతో పాటు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు కూడా అందించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ.. జిల్లాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీని వేగవంతంగా పంపిణీ చేయడం పట్ల జిల్లా కలెక్టర్లను అభినందించారు. త్వరిత గతిన ఈ చీరలను పూర్తిగా పంపిణీ చేయాలని ఆదేశించారు. రేపు అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి సంబంధిత జిల్లాల ఇంచార్జి మంత్రులు, జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరినీ ఆహ్వానించాలని స్పష్టంచేశారు. రాష్ట్రంలో లక్ష మంది విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయడం జరిగిందని, ఈ స్కాలర్షిప్స్ లను సమర్థవంతంగా పంపిణీ చేయడానికి మీ జిల్లాల్లో వెల్ఫేర్ విభాగాల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జ్యోతి బుద్ధా ప్రకాష్, హౌసింగ్ ఎండి గౌతమ్, సెర్ఫ్ సీఈఓ దివ్య, పంచాయతీ రాజ్ కమిషనర్ సృజన లు పాల్గొన్నారు.






