- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్.. కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మన పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం డ్రీమ్ ప్రాజెక్ట్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మన పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం డ్రీమ్ ప్రాజెక్ట్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం ప్రజా భవన్‌లో జిల్లా కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీతో భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం పూర్తిచేసే బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్ల దేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. టెండర్లు పూర్తి అయిన చోట మంత్రి లేదా స్థానిక ఎమ్మెల్యేతో భూమి పూజ చేయించాలని, భవనాల నిర్మాణం పూర్తికి క్యాలెండర్ ఫిక్స్ చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ప్రతి వారం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ ప్రగతిపై సమీక్ష జరపాలని, నెలలో ఒకసారి కలెక్టర్లు తమ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ ప్రదేశానికి తప్పకుండా వెళ్లాలని అక్కడే సమీక్ష నిర్వహించాలని భట్టి విక్రమార్క సూచించారు. స్కూల్స్ నిర్మాణంలో నిధులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులను చెల్లిస్తామని ఆయన తెలిపారు.
కాంట్రాక్టర్లపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పటివరకు విడివిడిగా ఉన్నాయని, వీటన్నిటిని ఒకే చోట చేర్చి ఒక గొప్ప సందేశాన్ని ప్రపంచానికి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లుగా భట్టి విక్రమార్క వెల్లడించారు. సమాజంలో వర్గాలుగా విడగొట్టబడిన వారందరినీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా ఒకచోటకు తమ ప్రభుత్వం తీసుకు రాబోతుందని ఆయన చెప్పారు. ఈ పాఠశాలలు దేశంలోనే ఒక రోల్ మోడల్ గా, గేమ్ చేంజెర్లుగా మారుతాయని భట్టి విక్రమార్క తెలిపారు. అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న 15 రోజుల్లో కాంట్రాక్టర్లు పని ప్రారంభించకపోతే కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వచ్చే విద్యా సంవత్సరానికి అత్యధిక శాతం స్కూల్స్ అందుబాటులోకి రావాలని, స్థానికంగా భూమి ఇతర సమస్యలు ఉంటే స్థానిక ఎమ్మెల్యే లేదా సీసీఎల్ఏ, చీఫ్ సెక్రటరీతో కలెక్టర్లు మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించాలని భట్టి విక్రమార్క సూచించారు. బిల్డింగ్స్ నిర్మాణంలో ఎప్పటికప్పుడు క్వాలిటీ చెక్ కోసం థర్డ్ పార్టీ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని, నిర్మాణం జరిగే ప్రాంతానికే క్వాలిటీ చెక్ బృందం వెళ్లాలని ఆయన ఆదేశించారు. పనుల ప్రగతిపై వారానికి ఒకసారి చీఫ్ సెక్రటరీ కలెక్టర్ల నుంచి నివేదిక తీసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ బలరాం నాయక్, సీఎస్ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






