కూల్చారు.. మరిచారు! కామారెడ్డి పాత హైవేపై వాహనదారుల వేదన

by Ramesh Naini |

గత ఆగస్టులో వచ్చిన భారీ వరదల నుంచి కాలనీలను కాపాడేందుకు అధికారులు జేసీబీలతో డివైడర్లను కూల్చివేశారు. వరదలు తగ్గి ఏడాది గడుస్తున్నా హౌసింగ్ బోర్డు నుంచి స్వాగతం బోర్డు వరకు 2 కి.మీ మేర రోడ్డును అలాగే వదిలేశారు.

కూల్చారు.. మరిచారు! కామారెడ్డి పాత హైవేపై వాహనదారుల వేదన
X

కామారెడ్డి టౌన్ పాత జాతీయ రహదారి-7 పై ధ్వంసమైన డివైడర్ల పునర్నిర్మాణాన్ని అధికారులు పూర్తిగా గాలికొదిలేశారు. గత ఆగస్టులో వచ్చిన భారీ వరదల నుంచి కాలనీలను కాపాడేందుకు అధికారులు జేసీబీలతో డివైడర్లను కూల్చివేశారు. వరదలు తగ్గి ఏడాది గడుస్తున్నా హౌసింగ్ బోర్డు నుంచి స్వాగతం బోర్డు వరకు 2 కి.మీ మేర రోడ్డును అలాగే వదిలేశారు. డివైడర్లు లేకపోవడంతో వాహనాలు ఇష్టారాజ్యంగా నడుపుతుండడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పూర్తిగా కరువైంది. కూల్చివేత సమయంలో సెంట్రల్ లైటింగ్ వైర్లు తెగిపోవడంతో రాత్రివేళ ఈ దారి అంధకారంగా మారుతోంది. మళ్లీ వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి డివైడర్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

దిశ, కామారెడ్డి టౌన్ : గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలను వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో కాలనీల ప్రజలను ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు, వరద నీటిని వేగంగా మళ్లించేందుకు రోడ్డు మధ్యలోని డివైడర్లను అధికారులు అత్యవసరంగా ధ్వంసం చేశారు. అయితే, ఆ డివైడర్లను పగలగొట్టి ఏడాది గడిచినా తిరిగి పునర్నిర్మించకపోవడంతో పాత జాతీయ రహదారి-7 (పాత ఎన్‌హెచ్-44) పై వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి నర్సన్నపల్లి కామారెడ్డి స్వాగతం బోర్డు వరకు ఉన్న డివైడర్లను అధికారులే జేసీబీలతో కూల్చివేసి ఇప్పటివరకు కనీసం పట్టించుకోకపోవడంపై స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వరద నీటి మళ్లింపునకు కూల్చివేత..

గత సంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి పెద్ద చెరువు అలుగు పొంగింది. వందేళ్ల రికార్డు స్థాయిలో వర్షం పడడంతో హౌసింగ్ బోర్డ్ కాలనీ, జీఆర్‌ కాలనీ, కౌండిన్య కాలనీలు 12 నుంచచి 16 అడుగుల వరద నీటిలో మునిగిపోయాయి. ఇళ్లలోకి వరద చేరి మొదటి అంతస్తు వరకు మునిగిపోవడంతో ప్రజలు ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నారు. అదే సమయంలో పాత జాతీయ రహదారి-7 పై ఉన్న సెంటర్ లైటింగ్ డివైడర్ల వల్ల వరద నీరు వెనక్కి తన్ని కాలనీలను మరింత ముంచెత్తింది. దీంతో ప్రజల ప్రాణాలు ముఖ్యమని భావించిన అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు జేసీబీలతో డివైడర్లను పగలగొట్టి నీటిని మళ్లించారు. ఆ రోజు డివైడర్లు కూల్చకపోతే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.

ఇప్పుడు ప్రమాదాలకు నిలయం..

వరదలు తగ్గి ఏడాది కావస్తున్నా పగలగొట్టిన డివైడర్లను అధికారులు పునర్నిర్మించకపోవడంతో సుమారు 2 కి.మీ మేర రోడ్డు మధ్యలో రక్షణ లేకుండా పోయింది. డివైడర్లు కూల్చే సమయంలో సెంట్రల్ లైటింగ్ వైర్లు తెగిపోవడంతో అప్పటి నుంచి స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. దీంతో రాత్రివేళ ఈ ప్రాంతం పూర్తిగా చీకటిమయంగా మారుతోంది. డివైడర్ లేకపోవడంతో వాహనాలు రెండు వైపులా ఇష్టానుసారంగా వెళ్తున్నాయి. కారు, బైక్ లైట్ల వెలుతురు నేరుగా కళ్లపై పడడంతో రాత్రిపూట నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ఈ పాత నేషనల్ హైవేపై ట్రాఫిక్ నియంత్రణ కరువై చాలామంది రాంగ్ రూట్‌లో దూసుకొస్తూ ప్రాణాల మీదకు తెస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం..

అప్పట్లో ప్రజలను కాపాడేందుకు డివైడర్లు కూల్చడం సరైన నిర్ణయమే అయినప్పటికీ, పరిస్థితులు చక్కబడిన తర్వాత వెంటనే వాటిని బాగు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ నేషనల్ హైవే అథారిటీ, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులు ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని కాలనీ వాసులు మండిపడుతున్నారు. అప్పుడు ప్రాణాలు కాపాడేందుకు డివైడర్లు కూల్చారు, కానీ ఇప్పుడు అదే డివైడర్లు లేక రోడ్డు ప్రమాదాల్లో మా ప్రాణాలు పోతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వర్షాకాలం ప్రారంభమై నందున, ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి తక్షణమే డివైడర్ల పునర్నిర్మాణం తో పాటు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story