BRS: ఢిల్లీ పాలిటిక్స్ రాజశ్యామల యాగంతో షురూ!

by Disha Web Desk 4 |
BRS: ఢిల్లీ పాలిటిక్స్ రాజశ్యామల యాగంతో షురూ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంతకాలం తెలంగాణకు మాత్రమే పరిమితమైన టీఆర్ఎస్ పార్టీ, జాతీయస్థాయిలో బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారిన నేపథ్యంలో ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని అధినేత కేసీఆర్ బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజుల పాటు యాగం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ ఆదివారం స్వయంగా పరిశీలించారు. వాస్తు సంబంధమైన అంశాలపైనా నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ కొన్ని సూచనలు చేశారు. యాగశాల స్థలాన్ని ఎంపిక చేయడంతో పాటు దానికి అవసరమైన ఏర్పాట్లపై కూడా సూచనలు చేశారు. పార్టీ వర్గాలు మాత్రం ఈ నెల 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు రాజశ్యామల యాగాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి.

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి 2018 డిసెంబరులో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన కేసీఆర్ ఆశాజనకమైన ఫలితాలనే పొందారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పేరుతో వెళ్ళాలనుకున్న సమయంలో ఢిల్లీ వేదికగానే ఈ సారి ప్లాన్ చేస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీ చైర్‌పర్సన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌‌పర్సన్లు, రాష్ట్ర నాయకులు, తదితరులంతా హాజరుకానున్నారు. ఈ నెల 13న వారంతా ఢిల్లీకి చేరుకుంటారని, దానికి తగిన వసతి, భోజన సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మరోవైపు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్‌‌ను తీసుకెళ్ళడానికి దారితీసిన పరిస్థితులను అన్ని రాష్ట్రాల మీడియా ప్రతినిధులకు వివరించడానికి ప్రత్యేక సమావేశాన్ని కూడా అక్కడే 14వ తేదీన నిర్వహించనున్నట్లు కేసీఆర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆఫీసు ప్రారంభోత్సవానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ లాంటి నేతలను ఆహ్వానించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, స్వయంగా కేసీఆరే వాటిని పర్యవేక్షిస్తున్నారని, ఒకటి రెండు రోజుల్లో దానిపై క్లారిటీ రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నాలుగైదు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ క్రమంలో కేవలం రాజకీయ నేతలే కాకుండా రిటైర్డ్ ఆర్మీ అధికారులు, బ్యూరోక్రాట్లు తదితరులతో కూడా సమావేశం జరిగేలా ఏర్పాట్లు సమాంతరంగా జరుగుతున్నాయి.

రైతే కేంద్రంగా జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావిస్తున్నందున ఆర్థికవేత్తలతో పాటు రైతు సంఘాల ప్రతినిధులతోనూ ఢిల్లీలో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. తొలుత ఈ నెల 12న ఢిల్లీ వెళ్ళేలా కేసీఆర్ టూర్ ఖరారైనా అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి వేముల, ఎంపీ సంతోష్ సూచనల మేరకు ఈ నెల 13న ఉదయం వెళ్ళే అవకాశాలున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ అవసరం గురించి మాత్రమే ఈ టూర్‌లో కేసీఆర్ వివరిస్తారని, పూర్తిస్థాయిలో ఎజెండాను, పాలసీలను వివరించకపోవచ్చని, దానికి భారీ స్థాయి బహిరంగసభను ఏర్పాటుచేసి అన్ని పార్టీల ప్రతినిధులను ఆహ్వనించి వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.

Also Read...

BRS విస్తరణకు కేసీఆర్ భారీ స్కెచ్


Next Story

Most Viewed