- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీహెచ్ఎంసీ శానిటేషన్ విధులపై డీఈఈల నిరాసక్తత
జీహెచ్ఎంసీ ఏరియాను 300 వార్డుల, 60 సర్కిళ్లు, 12 జోన్లుగా విభజించిన తర్వాత అన్ని విభాగాల అధికారులను కమిషనర్ కర్ణన్ మార్చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఏరియాను 300 వార్డుల, 60 సర్కిళ్లు, 12 జోన్లుగా విభజించిన తర్వాత అన్ని విభాగాల అధికారులను కమిషనర్ కర్ణన్ మార్చేశారు. గతంలో హెల్త్ అండ్ శానిటేషన్ కార్యక్రమాలను అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షించేవారు. అయితే మెడికల్ ఆఫీసర్లు శానిటేషన్ కార్యక్రమాలను పర్యవేక్షించడమేంటని, ఇక నుంచి శానిటేషన్ కార్యక్రమాలను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (డీఈఈ) మాత్రమే చూడాలని కర్ణన్ ఆదేశాలు జారీచేశారు. అందులో భాగంగానే సర్కిల్‌కు ఒక డీఈఈని కేటాయించారు. కానీ కమిషనర్ ఆదేశాలను అమలు చేయడానికి కొంత మంది డీఈఈలు నిరాకరిస్తున్నారు. తమకు చెత్త విధులొద్దని చెబుతున్నారు. కొంత మంది అయితే తమకు ఇంజినీరింగ్ మెయింటెనెన్స్ విధులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయం కమిషనర్ కర్ణన్ దృష్టికి చేరింది. దీంతో ఇంజినీర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
డీఈఈలకు శానిటేషన్
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ)లపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ విస్తరణ తర్వాత శానిటేషన్ బాధ్యతలను డీఈఈలకు అప్పగించారు. విస్తరణ తర్వాత 30 నుంచి 60 సర్కిల్స్ పెరిగాయి. ఇలా 60 మంది డీఈఈలను నియమించారు. జీహెచ్ఎంసీ విస్తరణకు ముందు ఈ బాధ్యతలు మెడికల్ ఆఫీసర్లు నిర్వహించేది. ఇప్పుడు ఈ పనులు మొత్తం డీఈఈలకు అప్పగించారు. అయితే తాము ఈ పనులు చేయలేమని చేతులెత్తేసినట్లు తెలిసింది. శానిటేషన్ బాధ్యతలు చేపట్టే అధికారులు ఉదయం 5.30 గంటలకు ఫీల్డ్‌లోకి రావాల్సి ఉంది. దీంతో పాటు ఎక్కడా రోడ్లపై చెత్త లేకుండా చూడటం తో పాటు నగరంలో చెత్త సమస్య లేకుండా పర్యవేక్షించాల్సి ఉంది. అయితే తాము ఈ పనులు చేయమని చెప్పినట్లు తెలిసింది. ముఖ్యంగా మొన్నటి వరకు మెయింటెనెన్స్ విభాగంలోపని చేసిన ఇంజినీర్లు శానిటేషన్ పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం.
అలాగే తమకు ఇండ్లకు దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని కొందరు డీఈఈలు ఉన్నతాధికారులను కోరుతున్నారు. మొత్తానికి కొంతమంది ఈ పనులు చేసేందుకు ఇష్ట పడటం లేదు. ఇదివరకు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద సీ అండ్ డీ (నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు) వేస్ట్‌ను ప్లాంట్లకు తరలించడంతో పాటు రోడ్లపై ఉన్న వ్యర్థాలను తరలించే పనులను పర్యవేక్షించేవారు. ఇప్పుడు శానిటేషన్ బాధ్యతలు వీరికి అప్పగించారు. తెల్లవారుజామున నుంచే ఫీల్డ్‌లో ఉండాల్సి రావడంతో కొందరు ఇంట్రెస్ట్ చూపడంలేదు. దేశంలోని అనేక ప్రముఖ నగరపాలక సంస్థల్లో ఇంజినీర్లే శానిటేషన్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇతర కార్పొరేషన్ల తరహాలోనే ఇక్కడా పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరచడానికి ఇంజినీర్లకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ బాధ్యతలపై డీఈఈలు అయిష్టంగా ఉన్నారు.
కమిషనర్ సీరియస్
డీఈఈల తీరుపై కమిషనర్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించ లేకపోతే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు రెండేండ్ల పాటు శానిటేషన్ విధులు నిర్వహిస్తేనే ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయని స్పష్టం చేశారు. దీన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం.






