- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిసెంబర్ 9 డెడ్‌లైన్: ఉద్యమకారుల కోసం భూపోరాటానికి కవిత వార్నింగ్
డిసెంబర్ 9 నాడు ఉద్యమకారులకు భూములు ఇస్తున్నట్లు ప్రకటించకపోతే.. జాగృతి తరఫున భూపోరాటాలు ప్రారంభం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వార్నింగ్ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: డిసెంబర్ 9 నాడు ఉద్యమకారులకు భూములు ఇస్తున్నట్లు ప్రకటించకపోతే.. జాగృతి తరఫున భూపోరాటాలు ప్రారంభం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ అమరవీరుల స్మృతిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాగృతి నాయకులు, కార్యకర్తలతో కలిసి కవిత రక్తదానం చేశారు. అనంతరం కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. అమరులను స్మరించుకుంటూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించామని తెలిపారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను కార్యక్రమంలో తలుచుకోవటం జరిగిందన్నారు. నాటి కేసీఆర్ దీక్ష, అమరుల బలిదానాలు, విద్యార్థుల త్యాగాలు, తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమం ద్వారా తెలంగాణ తెచ్చుకున్నామని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉద్యమకారులను అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిన వారిని గౌరవించకపోవడం అందరినీ బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో మనమే 12 వందల మంది అమరులయ్యారని చెప్పినట్లు గుర్తుకు చేశారు. కానీ కేవలం 540 కుటుంబాలకు మాత్రమే సహాయం చేశామని వెల్లడించారు. వారికి కూడా కనీస గౌరవం ఇవ్వలేదు.. రాష్ట్రావతరణ రోజున పిలిచి శాలువ కూడా కప్పలేదని ఆవేదన చెందారు.
వారికి గుర్తింపు కార్డులు, గౌరవం ఇవ్వలేదన్న బాధ ప్రజల్లో ఉన్నట్లు జనంబాటలో తిరుగుతున్నప్పుడు తాను గమనించినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను మేము సరిచేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు, 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుకు చేశారు. ముఖ్యమంత్రి ఉద్యమకారులకు చెప్పింది చెప్పినట్లుగా డిసెంబర్ 9 నాడు అనౌన్స్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు పెన్షన్లు, గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాలని వార్నింగ్ ఇచ్చారు. అప్లికేషన్స్ పెట్టుకోవాలంటూ రెండేళ్లుగా మీరు కాలయాపన చేస్తున్నారని, కనీసం రాష్ట్రావతరణ రోజున ఉద్యమకారులు, వారి కుటుంబాలను గౌరవించిన పాపాన పోలేదని మండిపడ్డారు. మేము డిమాండ్ చేస్తే గానీ అమరుల స్థూపం వద్దకు వెళ్లలేదు.. జై తెలంగాణ అనలేదు.. అని విమర్శించారు.
మీరు నేడు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారంటే అమరుల పోరాటమేనని గుర్తించాలని హితువు పలికారు. వారికి మీరు చేసిన వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకోవాలన్నారు. డిసెంబర్ 9 నాడు మీరు ఉద్యమకారులకు భూములు ఇస్తున్నట్లు ప్రకటించకపోతే.. జాగృతి తరఫున భూపోరాటాలు ప్రారంభం చేస్తామని హెచ్చరించారు. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడకు ఉద్యమకారులను తీసుకెళ్లి వారికి ఆ భూమిని పంచుతామని స్పష్టం చేశారు. మా రక్తం, చెమట ధారపోసి తెలంగాణ తెచ్చాం.. అలాంటి వారందరికీ కూడా భూములు దక్కాల్సిన అవసరముందని తెలిపారు. ఉద్యమకారుల కోసం చేసే భూ పోరాటంలో భూమి ఎక్కడ ఉంటే అక్కడ జాగృతి జెండాలు కూడా పాతుతామని స్పష్టం చేశారు. డిసెంబర్ 9 నాడు సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించిన ప్రకటన చేయాలని, లేదంటే జాగృతి తరఫున భూ పోరాటాలు ప్రారంభమవుతాయని కవిత హెచ్చరించారు.






