- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hilt Policy: ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదు.. హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరిక
బీఆర్ఎస్ లో జరిగిన అక్రమాలపై కవిత చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు ప్రస్తావించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రకృతి ఒకసారి నాశనమైతే తిరిగి తీసుకురాలేమని అందువల్ల రేపటి తరాల భవిష్యత్, నేల మనుగడ కోసం హిల్ట్ పాలసీ తీసుకువస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించడం మన బాధ్యత అని చెప్పారు. ఇవాళ హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హిల్ట్ పాలసీని సాదాసీదా భూమార్పిడిగా చూస్తున్నారని కానీ ఈ పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతం నివాస ప్రాంతంగా మారుతోందన్నారు. హిల్ట్ పాలసీ విషయంలో సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామన్నారు. మాపై బురద చల్లాలని, విమర్శలు చేసేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రేపటి భాగ్యనగరం కోసం రాజకీయాలు పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు.
బేసిక్స్ తెలియకుండానే బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు:
హిల్ట్ పాలసీ బయటకు రాకముందే విమర్శలు చేస్తున్నారని, బేసిక్ సమాచారం తెలియకుండా బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ భూములు అడ్డగోలుగా ఇస్తున్నారని మాట్లాడుతున్నారు. కానీ దశాబ్దాల కిందటే గత ప్రభుత్వాలు వారికి భూములు అమ్మేశాయి. పారిశ్రామిక వేత్తల భూములు ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారన్నారు. హిల్ట్ పాలసీ కింద ఆరు నెలల గడువు ఇస్తాం. స్వచ్చందంగా ముందుకొస్తేనే భూములు కన్వర్ట్ చేస్తామన్నారు. పారదర్శకంగా ముందుకెళ్లేలా పాలసీ తీసుకొచ్చామని 2013లోనే రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్ ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించాలని జీవో ఇచ్చారన్నారు. గతపాలకులు కూడా కేబినెట్ సబ్ కమిటీ వేశారని గతంలో భూములు కన్వర్ట్ చేస్తుంటే బీజేపీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇండస్ట్రియల్ పార్కులకు బీఆర్ఎస్ నేతలు వెళ్లినా వారిని ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. ల్యాండ్ కన్వర్షన్‍కు ఫీజు తగ్గించాలని పారిశ్రామిక వేత్తలు మమ్మల్ని కోరుతున్నారని చెప్పారు. హైదరాబాద్ గ్రిడ్ పాలసీ అని 2020లో తీసుకొచ్చాం. గ్రిడ్ పాలసీ కింద 11 ఇండస్ట్రియల్ ప్రాంతాలను ఐటీ కారిడార్‍లుగా మార్చాలని ప్రయత్నించారు. కానీ నాడు ఎవ్వరూ ముందుకు రాలేదు. లీజు ల్యాండ్ ను ఫ్రీ హోల్డ్ చేసిన గత పాలకులు మమ్మల్ని ప్రశ్నిస్తారా? అని నిలదీశారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో కవిత నిన్ననే సభలో మాట్లాడారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ భూవినియోగ మార్పిడి విషయంలో ఏ రకమైన విచారణ జరిపించాలో సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈ అక్రమాల విషయంలో ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదన్నారు.
ఇప్పటికీ మేల్కోకపోతే కష్టమే:
ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాల్లో కాలుష్యం లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. నగరంలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలివైపు తరలిస్తాని చెప్పారు. జీడిమెట్ల, ఉప్పల్, సనత్ నగర్, చర్లపల్లి, ప్రాంతాలు ఇండస్ట్రియల్ జోన్లుగా ఉండేవి. ఒక్కప్పుడు ఈ ప్రాంతాలు జనావాసాలకు దూరంగా ఉండేవి. కానీ ఈ 50 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంగా విస్తరించింది. ఒకప్పుడు నగర శివారు ప్రాంతాలు ప్రస్తుతం రెసిడెన్షియల్ కాలనీస్ గా మారాయి. నాడు ఫ్యాక్టరీకి ఇంటికి మధ్య కిలోమీటర్ దూరం ఉంటే ఇప్పుడు ఫ్యాక్టరీ గోడకు ఆనుకునే ఇంటి గోడ ఉంటోంది. పరిశ్రమల నుంచి వచ్చే పొగను ప్రత్యక్షంగా పీలుస్తున్నారు. పరిశ్రమలు, రెసిడెన్షియల్ ప్రాంతాలకు మధ్య బఫర్ జోన్లు లేకుండా పోయాయన్నారు. బఫర్ జోన్లు లేకపోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్, భోపాల్ గ్యాస్ దుర్ఘటనలు జరిగాయన్నారు. నగంరలోని భూగర్భజలాల్లో విషపూరిత పదార్థాలు ఉన్నాయని, పారిశ్రామిక రసాయనాల వల్లే భూగర్భజలాల్లో విషపూరిత పదార్థాలు చేరాయన్నారు. ఇప్పటికీ మేల్కోకపోతే హైదరాబాద్ కూడా ఢిల్లీ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతి ఇంటికీ ఒక ఆసుపత్రి ఉంటుందని అందువల్ల హిల్ట్ పాలసీ విషయంలో సభ్యులు రాజకీయాలు పక్కన పెట్టాలన్నారు.
ఆత్మవిమర్శ చేసుకోండి:
చైనాలో బ్లూ స్కై పాలసీ ద్వారా భారీ పరిశ్రమలను నగరం అవతలి వైపునకు తరలించారని, పారిశ్రామిక ప్రగతి కంటే ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తు చేశారు. ఢిల్లీలోని నివాసాల మధ్య ఉన్న 168 పరిశ్రమలను తరలించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు తీర్పు ప్రాతిపదికన హిల్ట్ పాలసీ తీసుకొచ్చామన్నారు. పూర్వీకులు స్వచ్ఛమైన ప్రకృతిని వారసత్వంగా అందించారు. రేపటి తరానికి స్వచ్ఛమైన ప్రకృతిని అందజేస్తున్నామా లేదా అని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. మనం వారసత్వంగా ఇచ్చిన సంపద వారి ప్రాణాలను కాపాడుతుందా అని ప్రశ్నించారు.






