- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆన్‌లైన్ ఫార్మసీలపై డీసీఏ ఉక్కుపాదం!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఉక్కుపాదం మోపింది.

- రాష్ట్రవ్యాప్తంగా 166 మెడికల్ షాపుల్లో సోదాలు
- నిబంధనలు ఉల్లంఘించిన 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఉక్కుపాదం మోపింది. నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే పక్కా సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ పేరిట ముమ్మర తనిఖీలు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 166 మెడికల్ షాపులను తనిఖీ చేయగా, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన 41 షాపులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆన్‌లైన్ మెడిసిన్ డెలివరీ సర్వీసులు, వాటి అనుబంధ భాగస్వామ్య ఫార్మసీలకు చెందిన 159 షాపులతో పాటు, ఇండియామార్ట్ వంటి ఆన్‌లైన్ బీ2బీ ప్లాట్‌ఫామ్‌లతో సంబంధం ఉన్న మరో 7 షాపుల్లో డీసీఏ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి.
ఘోరమైన నిబంధనల ఉల్లంఘన
మందుల విక్రయాలకు సంబంధించిన సేల్స్ బిల్లులు, కొనుగోలు ఇన్‌వాయిస్‌లను నిర్వహించకపోవడం, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్, షెడ్యూల్ హెచ్1 డ్రగ్ రిజిస్టర్లను సరిగ్గా మెయింటైన్ చేయడంలో విఫలం కావడం, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే యథేచ్ఛగా మందులు సరఫరా చేయడం, కనీసం క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణ కూడా లేకుండా మందులు విక్రయించడం వంటి ఘోరమైన నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లుగా అధికారులు తనిఖీల్లో గుర్తించారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 నిబంధనల ప్రకారం.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లతో ముడిపడి ఉన్న మెడికల్ షాపులైనా ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిందేనని ఈ సందర్భంగా డీసీఏ డీజీ అవినాష్ మొహంతి స్పష్టం చేశారు. షోకాజ్ నోటీసులు అందుకున్న 41 షాపులపై చట్టపరంగా తదుపరి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.






