రాష్ట్రంలో జనగణనకు ముహూర్తం ఫిక్స్.. రెండు విధానాల్లో సర్వే

by Kema Shiva Kumar |

తెలంగాణలో జనగణనతో పాటు అందులో భాగంగానే కులగణన చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రంలో జనగణనకు ముహూర్తం ఫిక్స్.. రెండు విధానాల్లో సర్వే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో జనగణనతో పాటు అందులో భాగంగానే కులగణన చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జనగణన జరుగుతుండగా.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇది 8వ సారి.. జనగణన ప్రక్రియ మొదలయ్యాక 16వ సారి సెన్సస్ ప్రక్రియను చేపట్టనున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా జనగణనతో పాటే కులగణన చేయనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జనగణన చేపట్టడం ఇదే తొలిసారి. ఇందుకోసం రాష్ట్రంలో ఏరియా మ్యాపింగ్‌ను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. 75 వేల బ్లాకులను సైతం గుర్తించారు. ఒక్కో ఎన్యుమరేటర్​175 నుంచి 200 ఇండ్ల జనగణన చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2‌‌026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ , 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. జనాభా లెక్కలు ప్రారంభించిన నాటి నుంచి ఈ తేదీలనే ఫాలో అవుతున్నారు.

టీచర్లే ఎన్యుమరేటర్లు..

దేశవ్యాప్తంగా ఎన్యుమరేటర్లుగా పనిచేసే వారు అత్యధిక శాతం ప్రభుత్వ టీచర్లే ఉండటంతో పాఠశాలలకు సెలవులు ఉన్నప్పుడు ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. హౌస్‌హోల్డ్​మ్యాపింగ్​సైతం టీచర్ల ద్వారానే చేయిస్తారు. హౌస్‌హోల్డ్​మ్యాపింగ్‌లో కుటుంబ పెద్దకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జరిగే సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను సర్వే చేస్తారు. జనాభా లెక్కలను గ్రామీణ ప్రాంతాల్లో ‘రెవెన్యూ గ్రామం’ ప్రాతిపదికన తీసుకొని లెక్కలు చేయనున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో ‘వార్డుల’ ప్రాతిపదికన చేస్తారు. ఏప్రిల్​నుంచి సెప్టెంబర్​మధ్యలో 30 రోజుల పాటు హౌస్‌‌హోల్డ్​మ్యాపింగ్, మరో 15 రోజులు నేషనల్ పాపులేషన్​రిజిస్ట్రర్​ వివరాలను సేకరిస్తారు. ఇలా మొత్తం 45 రోజుల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం తనకు అనువైన నెలల్లో ఈ సర్వేను చేసుకునే వెసులుబాటు ఉంది. జనాభా లెక్కలను ఎక్సెటెండెడ్ విధానంలో చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో హౌస్‌హోల్డ్​మ్యాపింగ్‌ను గుగూల్ మ్యాపింగ్​ద్వారా పూర్తి చేశారు. కులగణనకు కేంద్ర సామాజిక మంత్రిత్వ శాఖ జారీ చేసే కులాల వివరాల ప్రకారం వివరాలను నమోదు చేయనున్నారు. దీంతో రాష్ట్రాలు చేపట్టిన కులగణన లెక్కల వివరాలను కేంద్ర కులగణన సర్వేలో పరిగణలోకి తీసుకోరు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్​ వివరాలు, ఉప కులాల వివరాలను సేకరిస్తారు.

కొత్త స్థానిక సంస్థల ఏర్పాటుకు ఈ నెల 30 వరకే అవకాశం

దేశంలో అత్యధికంగా భౌగోళిక మార్పులు జరిగింది తెలంగాణలోనేనని జనాభా లెక్కల అధికారులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటివరకు ఏదో రకమైన భౌగోళిక మార్పులు జరుగుతున్నాయని గుర్తించారు. కొత్త మండలం ఏర్పాటు, మండలం పేరు మార్పు, కొత్త మున్సిపాలిటీ, కొత్త జిల్లా, కొత్త గ్రామ పంచాయతీ, సరిహద్దులు మార్చడం, మున్సిపాలిటీల్లో కొత్త గ్రామాల విలీనం తదితర వాటితో అత్యధిక భౌగోళిక మార్పులు ఇక్కడే జరిగాయని అధికారులు గుర్తించారు. ఇలా మార్పులు చేయడానికి ఈనెల 30 వరకే గడువు విధించారు. ఈ తేదీ వరకు మార్పులు చేయాలని జనాభా లెక్కల విభాగం రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెలాఖరు నుంచి ఇకపై రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు, మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేయడానికి వీలు లేదు. ఒక వేళ ప్రభుత్వం ఏర్పాటు చేసినా వాటి ప్రకారం కాకుండా జూన్ 30 నాటికి ఉండే వాటి ప్రకారమే జనాభా లెక్కలను చేస్తారు.

ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వరు..

జనాభా లెక్కల్లో సర్వే చేసే సమయంలో దేశంలో ఉండే పౌరులందరి వివరాలను సేకరిస్తారు. దేశంలో ఉండే విదేశీయుల వివరాలను కూడా సేకరిస్తారు. అయితే, ఇది జనాభా గణన వివరాల సేకరణ అని.. సిటిజన్స్​వివరాల సేకరణ కాదనే విషయాన్ని జనాభా లెక్కల అధికారులు గుర్తు చేస్తున్నారు. జనాభా లెక్కల ద్వారా సేకరించిన వ్యక్తిగత వివరాలను ఎవరికీ అందించరు. జనాభా విభాగం వద్ద మాత్రమే ఉంటాయి. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినా వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో సెన్సస్..

గతంలో జనాభా గణన వివరాలను కేవలం ఆఫ్‌లైన్​ ద్వారా మాత్రమే చేయగా.. ఈసారి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్​విధానంలో చేయనున్నారు. అందుకోసం ప్రత్యేకంగా యాప్​కూడా రూపొందించినట్లు సమాచారం. ఈ యాప్​ ద్వారా వివరాలను సేకరించనున్నారు. దీని ద్వారా వివరాలను విశ్లేషించడం, తుది డేటాను ప్రకటించడానికి ఎక్కువ సమయం పట్టదని అంచనా వేస్తున్నారు. మొబైల్​ఆపరేట్ చేయలేని వారు మాత్రం ఆఫ్​‌లైన్​ద్వారా సేకరించేందుకు అనుమతిస్తారు. జిల్లా కలెక్టర్, మండల రెవెన్యూ అధికారి, మున్సిపల్​ కమిషనర్‌లు ఈ జనాభా గణనలో క్షేత్ర స్థాయిలో కీలక అధికారులుగా ఉంటారు. జనాభా లెక్కలు జరిగే సమయంలో కలెక్టర్​సహా దీనికి సంబంధించిన అధికారులను బదిలీ చేయడానికి వీలు లేదు. ఆ సమయంలో ఒక వేళ బదిలీ చేయాల్సి వస్తే జనాభా లెక్కల విభాగం అధికారుల ప్రత్యేక అనుమతి తీసుకుని చేయాల్సి ఉంటుంది. అన్ని స్థాయిల్లో అధికారులకు శిక్షణ ఇస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు.

Next Story