ఫ్యూచర్ సిటీలో 1500 ఎకరాల్లో డేటా సిటీ.. పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-20 10:22:33  IST  )

అంతర్జాతీయ ప్రమాణాలతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని పర్యావరణహిత ‘నెట్ జీరో సిటీ’గా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఫ్యూచర్ సిటీలో 1500 ఎకరాల్లో డేటా సిటీ.. పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్‌లో ఆయన పరిశ్రమల శాఖపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో.. ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్మెంట్, పరిశ్రమల ఏర్పాటు, ఐటీ పాలసీలపై సీఎం అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

నెట్ జీరో డిజైన్లు.. అంతర్జాతీయ ప్రమాణాలు

ఫ్యూచర్ సిటీ డిజైన్లు పూర్తిగా పర్యావరణహితంగా, ‘నెట్ జీరో సిటీ’ (Net Zero City) తరహాలోనే ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక్కడి మౌలిక వసతుల కల్పన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని, ఇందులో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నగరంలో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (Trunk Infrastructure) అభివృద్ధి చేసిన తర్వాతే భూ కేటాయింపులు జరపాలని చెప్పారు. వచ్చే జూన్ నెలలోనే ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపనలు జరిగేలా చూడాలని సీఎం టార్గెట్ పెట్టారు. ఫ్యూచర్ సిటీలో ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, మరియు జర్నలిస్టుల కోసం 500 ఎకరాలను కేటాయించనున్నట్లుగా సీఎం వెల్లడించారు.

ప్రధాని మోడీని కలుద్దాం..

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘హెల్త్ క్లస్టర్’ భారత్ ఫ్యూచర్ సిటీకే వచ్చేలా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే తానే స్వయంగా ప్రధాని మోడీని కలిసి, రాష్ట్రానికి హెల్త్ క్లస్టర్ కేటాయించాలని విజ్ఞప్తి చేస్తానని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో ఒక ప్రత్యేక సెల్, అత్యాధునిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా తోడ్పాటునందించేందుకు గ్రూప్-1 స్థాయి అధికారితో ‘ఎస్కార్ట్ ఆఫీసర్’ వ్యవస్థను తీసుకురావాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో 1,500 ఎకరాల విస్తీర్ణంలో భారీ ‘డేటా సిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ రంగాన్ని విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story