TG: అందరూ హాస్పిటల్స్‌లోనే ఉండాలి.. ఎవరికీ సెలవులు లేవు

by Gantepaka Srikanth |

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా(Damodar Raja Narasimha) ఆదేశాల మేరకు అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ఇతర ఉన్నతాధికారులతో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ రవిందర్ నాయక్‌

TG: అందరూ హాస్పిటల్స్‌లోనే ఉండాలి.. ఎవరికీ సెలవులు లేవు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా(Damodar Raja Narasimha) ఆదేశాల మేరకు అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ఇతర ఉన్నతాధికారులతో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ రవిందర్ నాయక్‌ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు కమిషనర్, డీహెచ్‌ పలు సూచనలు చేశారు. రాష్ట్రానికి నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అందరి సెలవులు రద్దు చేస్తున్నామని తెలిపారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంవోలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు, సిబ్బంది ఈ మూడు రోజులు కచ్చితంగా హాస్పిటల్స్‌లోనే ఉండాలన్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. డ్యూటీలకు గైర్హాజరు అయినా, నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్, డీహెచ్‌ హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో‌ వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య సేవలు అందించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న గర్భిణులను హాస్పిటల్స్‌లోని బర్త్ వెయిటింగ్ రూమ్స్‌కు తరలించి సేవలందించాలన్నారు.

అన్ని హాస్పిటల్స్‌లో అవసరమైన మెడిసిన్, టెస్టింగ్ కిట్స్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పాము, తేలు కాటు పేషెంట్లకు ఇచ్చే ఇంజక్షన్లు, మెడిసిన్‌ అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి టీచింగ్ హాస్పిటళ్ల వరకూ అందుబాటులో ఉండాలన్నారు. అంబులెన్స్‌లు, 102 వాహనాలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా తక్షణమే వెళ్లి పేషెంట్‌ను తరలించేలా‌ డ్రైవర్లు, ఈఎంటీలను 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, పవర్ కట్ అయిన మరుక్షణమే జనరేటర్స్ ప్రారంభించి రోగులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.

భారీ వర్షాల నేపథ్యంలో హాస్పిటల్స్‌ లోపలికి నీరు చేరకుండా, నిల్వ ఉండకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఇతర డిపార్ట్‌మెంట్ల ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ వైద్య సేవలు కొనసాగించాలని డీఎంహెచ్‌వోలకు సూచించారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్స్‌ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, వైద్య సేవలు అందించాలని అధికారులకు కమిషనర్ సంగీత సత్యనారాయణ సూచించారు.

Next Story