ఎన్నికల ముందు ‘దానకర్ణ’.. తర్వాత ‘కుంభకర్ణ’: అసెంబ్లీలో కేటీఆర్ ప్రాసలు, పంచ్‌లు

by Kema Shiva Kumar |

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ప్రాసలు, పంచ్‌లతో విరుచుకుపడ్డారు.

ఎన్నికల ముందు ‘దానకర్ణ’.. తర్వాత ‘కుంభకర్ణ’: అసెంబ్లీలో కేటీఆర్ ప్రాసలు, పంచ్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ‘దానకర్ణుడి’లా సాధ్యం కాని హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయకుండా ‘కుంభకర్ణుడి’లా నిద్రపోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అసెంబ్లీలో ప్రాసలు, పంచ్‌లతో ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు దాటుతున్నా హామీలు నెరవేరలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారని, కానీ నేడు ఆ సంతకానికి, ఆయన చేసిన డిక్లరేషన్లకు జనం దృష్టిలో ‘జీరో వాల్యూ’ ఉందన్నారు. సీఎం సంతకం చేసిన ఫైల్‌కే దిక్కులేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా నమ్ముతారని కేటీఆర్ ప్రశ్నించారు.

అది భస్మాసుర హస్తం..

కాంగ్రెస్ ఇచ్చింది ‘అభయహస్తం’ అని చెప్పుకుంటున్నా, అమలులో అది ‘భస్మాసుర హస్తం’గా మారిందని విమర్శించారు. రెండేళ్లు గడుస్తున్నా ప్రతి కుటుంబానికి రావాల్సిన రూ. 2.50 లక్షల లబ్ధి అందిన ఒక్క కుటుంబమైనా రాష్ట్రంలో ఉందా అని ప్రశ్నించారు. ఇటీవల ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిందని, ఒకవేళ ‘420 వరల్డ్ కప్’ (420 World Cup) పెడితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా గెలుస్తుందంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. 420 హామీల మేనిఫెస్టో రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని ఎద్దేవా చేశారు.

ఎగ్గొట్టు.. కూలగొట్టు.. చెడగొట్టు..

కాంగ్రెస్ (Congress) పాలనను మూడు ముక్కల్లో చెప్పాలంటే ‘ఎగ్గొట్టు.. కూలగొట్టు.. చెడగొట్టు’ అన్న చందంగా ఉందని విమర్శించారు. గల్లీల్లో చెత్త కుప్పలు పేరుకుపోతుంటే, పాలకులు మాత్రం ఢిల్లీకి విమాన యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు ‘నిల్’.. లూటిఫికేషన్లు ‘ఫుల్’ అని ఆరోపించారు. పెన్షనర్లకు టీఏ, డీఏలు రాక నరకయాతన పడుతున్నారని, గ్యారంటీ కార్డులు కాస్తా ఇప్పుడు ‘బాకీ కార్డులుగా’ మారి వెక్కిరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తూ ఎన్నికల ప్రచారం చేసుకుంటోందని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. జార్జ్ ఆర్వెల్ మాటలను గుర్తు చేస్తూ.. ‘మోసాల కాలంలో నిజం చెప్పడమే అతి గొప్ప విప్లవం’ అని, తాము కూడా ప్రజల గొంతుకగా అసెంబ్లీలో నిజాలను ప్రస్తావిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Next Story