మొంథా తుపాన్ ఎఫెక్ట్: తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

by Gantepaka Srikanth |

మొంథా తుపాన్ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఈ తుపాన్‌తో రాష్ట్రంలో అకాల వర్షాల ప్రభావం చూపే అవకాశం ఉన్నదని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి పేర్కొన్నారు.

మొంథా తుపాన్ ఎఫెక్ట్: తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొంథా తుపాన్ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఈ తుపాన్‌తో రాష్ట్రంలో అకాల వర్షాల ప్రభావం చూపే అవకాశం ఉన్నదని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద తుపాన్ ప్రభావం పడకుండా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లో రైతాంగం నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం ఎంసీహెచ్​ఆర్డీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మార్కెటింగ్​శాఖ అధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న టార్పాలిన్లు వినియోగించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం తడకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించాలని, అందుకు అవసరమైన రవాణా వసతి ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

30 నుండి 45 రోజుల వరకు ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం సమిష్టిగా పని చేయాలని అకాల వర్షాలు సంభవిస్తున్న నేపథ్యంలో వరి కోతలు నిలిపి వేస్తే రైతులకు ఇబ్బంది ఉండదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా ఇప్పటి వరకు 4,428 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసినట్లు తెలిపారు. మిగిలిన 3,814 కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నయన్నారు. నేటివరకు 22,433 మంది రైతుల నుండి ప్రభుత్వం 1,80,452 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. వాటిలో దొడ్డు రకం 73,628 మెట్రిక్ టన్నులు, సన్నాలు 1,06,824 మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం విలువ 431.09 కోట్లు ఉంటుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల పై నిరంతర పర్యవేక్షణ జరపాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు,పౌర సరఫరాల శాఖాధికారులు సందర్శించి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో అవినీతి చోటు చేసుకుంటే ఉపేక్షించేది లేదని, అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఈ తరహా ఆరోపణలకు తావు లేకుండా చూడాలని, ఇది రైతుపక్ష పాత ప్రభుత్వమని, ఏ కారణం చేత నైనా రైతులకు నష్టం వాటిల్లితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదన్నారు. ఈ సమావేశంలో సీఎస్​రామకృష్ణారావు,వ్యవసాయ శాఖా ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, కమిషనర్ గోపి,పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పౌర సరఫరాల శాఖా డైరెక్టర్ హనుమంతు కొండుబా,డైరెక్టర్ మార్కెటింగ్ లక్ష్మీ బాయి పాల్గొన్నారు.

Next Story