సైబరాబాద్ అభివృద్ధికి స్పెషల్ ఫోకస్.. ‘నో బిన్.. నో ట్రేడ్’

by Naga Rani Yarlagadda |

ఐటీ కారిడార్, రియల్ ఎస్టేట్ అడ్డా, కార్పొరేట్ ఆఫీసులకు కేంద్రంగా ఉన్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ)పై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.

సైబరాబాద్ అభివృద్ధికి స్పెషల్ ఫోకస్.. ‘నో బిన్.. నో ట్రేడ్’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఐటీ కారిడార్, రియల్ ఎస్టేట్ అడ్డా, కార్పొరేట్ ఆఫీసులకు కేంద్రంగా ఉన్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ)పై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సైబర్ సిటీకి తగినట్టుగానే ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే సీఎంసీ కమిషనర్ సృజన సైతం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆదాయ వనరుల గుర్తింపు, సమీకరణను సైతం ప్రాధాన్యతగా గుర్తించారు. పార్కులు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్, మున్సిపల్ షాపింగ్ మాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల పూర్తి వివరాలను సేకరించాలని నిర్ణయించారు.

పీపీపీ.. స్పోర్ట్స్ కాంప్లెక్స్

సీఎంసీ పరిధిలోని అన్నిరకాల అసెట్స్ గుర్తించాలని నిర్ణయించారు. షాప్స్ 428, స్పోర్ట్స్ కాంప్లెక్స్ 24, మల్టీఫర్పస్ ఫంక్షన్ హాల్స్ 21, కమ్యూనిటీ హాల్స్ 357, ఓపెన్ స్పేసెస్ 1590, ఫ్లై ఓవర్లు 21 ఉన్నాయి. ఓపెన్ స్పేసెస్ లో 50శాతం పార్కులు, 50శాతం ఫెసిలిటీ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్, పబ్లిక్ పార్ట్ నర్ షిప్(పీపీపీ) విధానంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లను అభివృద్ధి చేయనున్నారు. అక్రమ అడ్వర్ టైజ్ మెంట్ బోర్డులకు చెక్ పెట్టడానికి సీఎంసీ ఆధ్వర్యంలోనే ప్రత్యేక ఏరియాలను క్రియేట్ చేయాలని నిర్ణయించారు. ప్రతిసారి తొలగించడం కాకుండా ఈ ఏరియాకే ప్రత్యేక ఫీజును నిర్ణయించి క్రియేట్ చేయాలని కమిసనర్ భావిస్తున్నారు. దీంతోపాటు స్పోర్ట్స్ కాంప్లెక్సులు, షాపింగ్ మాల్స్ లకు సంబంధించిన అద్దె వివరాలపై సైతం నివేదిక తయారు చేయనున్నారు. లీజు గడువు ఉందా? ఉంటే ఫీజులు రెగ్యులర్ గా చెల్లిస్తున్నారా? లేదా? న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా? అన్ని వివరాలను అధికారులను కమిషనర్ ఆదేశించారు.

స్ట్రీట్ సెంటర్

సురక్షితమైన, అందరికీ అందుబాటులో ఉండే, ప్రజాకేంద్రిత వీధుల అభివృద్ధిపై కమిషనర్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే పట్టణ ప్రణాళిక నిపుణులు, ఇంజినీర్లు, పౌర పరిపాలన అధికారులు, ట్రాఫిక్ నిర్వహణ సంస్థల ప్రతినిధులతో సీఎంసీ అధికారులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పాదచారుల మౌలిక సదుపాయాలు, జంక్షన్ల అభివృద్ధి, వేగ నియంత్రణ చర్యలు, అందరికీ అనుకూలమైన రవాణా సౌకర్యాల కల్పన తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. దీంతో పాటు సురక్షితమైన వీధుల నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై పౌరసంస్థలు, ప్రణాళిక నిపుణులు, ఇంజినీర్ల సలహాలు, సూచనలు సైతం తీసుకోవాలని అధికారులకు సూచించారు.

క్లీన్ అండ్ గ్రీన్

క్యూర్ పరిధిలో శానిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు సైతం జారీచేశారు. ఈ నేపథ్యంలో సీఎంసీ పరిధిలో ‘నో బిన్ ..నో ట్రేడ్’ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. వ్యాపార సంస్థలు సైతం వ్యర్థాల నిర్వహణలో తమ వంతు బాధ్యతలను తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. స్వచ్ఛ ఆటోలు ప్రతిరోజూ తప్పనిసరిగా చెత్తను సేకరించేవిధంగా నిబంధనలు కఠినతరం చేశారు.

బాండ్ల సేకరణ

సీఎంసీ పరిధిలో భారీ ప్రాజెక్టులు చేపట్టడానికి నిధులను బాండ్ల ద్వారా సమీకరించాలని నిర్ణయించారు. కొత్త కార్పొరేషన్ కావడంతో రేటింగ్ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బాండ్ల సేకరణకు కావాల్సిన డాక్యుమెంట్లు, ఆదాయమార్గాలు, అసెట్స్ కు సంబంధించిన పేపర్ వర్క్ పూర్తిచేయడానికి అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ప్రాజెక్టులను కావాల్సిన నిధులను బట్టి బాండ్ల ద్వారా సేకరించనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.

Next Story