- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల వద్దకు కమిషనర్.. 76వార్డుల్లో పర్యటించాలని ప్రణాళిక
‘ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం. అధికారులు పారదర్శకత..జవాబుదారితనంతో వ్యవహరించాలి. ప్రజావాణి, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులను సైతం వెంటనే పరిష్కరించాలి. పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదో కారణం చెప్పాలి’ అని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) కమిషనర్ సృజన అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం. అధికారులు పారదర్శకత..జవాబుదారితనంతో వ్యవహరించాలి. ప్రజావాణి, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులను సైతం వెంటనే పరిష్కరించాలి. పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదో కారణం చెప్పాలి’ అని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) కమిషనర్ సృజన అన్నారు. జీహెచ్ఎంసీలో 27యూఎల్బీలను విలీనంతోపాటు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీగా మూడు కార్పొరేషన్లుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ మూడింటిలోనేకాదు రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయ వనరులు ఉన్న కార్పొరేషన్ కావడం విశేషం. ఒక పక్క ఆదాయ వనరులను సమీకరించడంతోపాటు ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా కమిషనర్ సృజన ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ప్రతివార్డులో పర్యటించడంతోపాటు ప్రజలతో ప్రత్యక్షంగా ముఖాముఖి కార్యక్రమం ద్వారా సమస్యలను తెలుసుకోవడంతోపాటు వాటిని పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టారు.
76 వార్డులు…
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలో 16 సర్కిళ్లు, 76వార్డులు ఉన్నాయి. సుమారు 35లక్షలకుపైగా జనాభా ఉందని అధికారుల అంచనా. అయితే సీఎంసీ మొదటి కమిషనర్ గా సృజన 16సర్కిళ్లను ఒక్కో సర్కిల్ మూడు సార్లు సందర్శించారు. ముఖ్యంగా సర్కిల్ స్థాయిలోని అన్ని సమస్యలపై అవగాహనకు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఏ సర్కిల్ లో ఏ సమస్య ఉంది? వాటి పరిష్కారం ఎలా? ఎన్ని నిధులు కావాలి? తక్షణమే పరిష్కరించే సమస్యనా? దీర్ఘకాలిక సమస్యనా? అనే అంశాలపై రిపోర్టు రూపొందించారు.
‘రోజుకో వార్డు’...
సీఎంసీ పరిధిలోని 76వార్డులను రోజుకు ఒకటి చొప్పున అన్నివార్డులను తనిఖీ చేయాలని కమిషనర్ నిర్ణయించారు. ఒక పక్క ప్రభుత్వం నిర్ణయించిన 99రోజుల ప్రణాళికతోపాటు మరో పక్క వార్డు స్థాయిలో సమస్యలను పరిష్కరించడానికి కమిషనర్ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతివార్డులో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిదులతో సమావేశమవుతున్నారు. వాళ్లు లేవనెత్తిన సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. అంతర్గత రహదారులపై ఇష్టానుసారంగా వాహనాల పార్కింగ్, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల వల్ల పాదచారులకు ఎదురవుతున్న సమస్యలను నివాసితులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పారిశుధ్యం & వ్యర్థాల నిర్వహణ, పార్కుల్లో ఎండుటాకుల కంపోస్టింగ్ యూనిట్ల ఏర్పాటు, క్రీడా మైదానాలు, అన్ని సమస్యలను గుర్తించి వాటికి సంబంధించిన యాక్షన్ రిపోర్టు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రెండు నెలలపాటు నిర్వహించనున్నారు.
ఆదాయ వనరుల సమీకరణ…
సైబరాబాద్ అంటేనే ఆదాయ వనరులకు పెట్టింది పేరు. అయితే హెచ్-సిటీ ప్రాజెక్టులకు మినహాయిస్తే అన్ని రకాల బిల్లులు చెల్లించడానికి, రోజువారి పాలన వ్యవహరాలకు సంబంధించిన ఖర్చులను స్వయంగా సమకూర్చుకోవడానికి కమిషనర్ సృజన ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే ఎర్లీబర్డ్ స్కీమ్ లో రూ.510కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేశారు. సీఎంసీ పరిధిలోని అన్ని రకాల అసెట్స్ గుర్తించారు. షాప్స్ 428, స్పోర్ట్స్ కాంప్లెక్స్ 24, మల్టీఫర్పస్ ఫంక్షన్ హాల్స్ 21, కమ్యూనిటీ హాల్స్ 357, 1590 ఓపెన్ స్పేసెస్, 21ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఓపెన్ స్పేసెస్ లో 50శాతం పార్కులు, 50శాతం ఫెసిలిటీ సెంటర్లుగా అభివృద్ది చేయాలని నిర్ణయించారు. ప్రయివేటు, పబ్లిక్ పార్ట్ నర్ షిప్(పీపీపీ) విధానంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లను అభివృద్ది చేయనున్నారు. అక్రమ అడ్వర్ టైజ్ మెంట్ బోర్డులకు చెక్ పెట్టడానికి సీఎంసీ ఆధ్వర్యంలోనే ప్రత్యేెక ఏరియాలను క్రియేట్ చేయాలని నిర్ణయించారు. ప్రతిసారి తొలగించడం కాకుండా…ఈ ఏరియాకే ప్రత్యేె ఫీజును నిర్ణయించి క్రియేట్ చేయాలని కమిసనర్ భావిస్తున్నారు.
బాండ్లకుసైతం…
సీఎంసీ పరిధిలో పెండింగ్ బిల్స్ రూ.150కోట్లు, మూడు జోన్లలో సుమారు రూ.300కోట్లకు సంబంధించిన పనులు మొత్తం రూ.450కోట్లు అవసరం ఉన్నవి. రోజువారీ కార్యక్రమాల కోసమైతే ఫండ్స్ కొరతలేదన్నారు. హెచ్-సిటీ ప్రాజెక్టుల కోసం రూ.2,500కోట్లు అవసరముందని, నిధుల కోసం ప్రభుత్వాన్ని అడుగుతామని కమిషనర్ చెప్పారు. దీంతోపాటు బాండ్ల ద్వారా నిధుల సమీకరించడానికి కూడా అవకాశాలు ఉన్నాయని, అందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఆదాయ వనరులు ఎక్కువగా ఉండడంతో బాండ్లతోపాటు బ్యాంకు రుణాలివ్వడానికి పలువురు బ్యాంకర్లు సైతం ముందుకొచ్చినట్టు సమాచారం.






