రూటు మార్చిన ‘సైబర్’ కేటుగాళ్లు.. ఫేక్ వీడియోలు, మెసేజ్‌లతో ఆర్థిక మోసాలు

by Kema Shiva Kumar |

రోజురోజుకూ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి.

రూటు మార్చిన ‘సైబర్’ కేటుగాళ్లు.. ఫేక్ వీడియోలు, మెసేజ్‌లతో ఆర్థిక మోసాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రోజురోజుకూ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో బాధితులు సైబర్ క్రైమ్‌కు గురై ఏదో ఒక రూపంలో తమ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వెలుగులోకి వచ్చిన ఘటనలు కొన్నైతే.. వెలుగులోకి రాని ఇన్సిడెంట్లు అనేకంగా ఉన్నాయి. అయితే ఆర్థిక మోసాలకు వేదికగా మారుతున్న సోషల్ మీడియాలో ఫేక్ అంశాలను కట్టడి చేయడంలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీసీఆర్‌పీ) విఫలమవుతుందనే చెప్పాలి. జియో ఫెన్సింగ్ విధానం ద్వారా ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లను నియంత్రించినా ఫేక్ వీడియోలను సర్క్యూలేట్ చేయకుండా కట్టడి చేయలేకపోతున్నట్టు రాష్ట్ర స్థాయి సైబర్ వింగ్స్ చెబుతున్నాయి. ఎన్‌సీసీఆర్‌పీ మాత్రమే ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నాయి.

నిర్మలా సీతారామన్ పేరుతో ఏఐ వీడియో

‘రూ.21 వేలు పెట్టుబడి పెట్టండి.. నెల రోజుల్లో రూ.20 లక్షలు పొందండి. ఈ స్కీమ్‌లో నేను సైతం చేరాను’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై కేంద్ర మంత్రి సీతారామన్ అక్టోబర్ 7న ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో స్పందించారు. ఏఐతో గొంతులు అనుకరించి, క్లోన్ ఐడెంటిటీతో వీడియోలు తయారు చేసి మోసం చేస్తున్నారని వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో రెండు నెలలుగా సర్క్యూలేట్ అవుతున్నా దానికి బ్లాక్ చేయడంలో ఎన్‌సీసీఆర్‌పీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.

గూగుల్ సీఈవో పేరుతో మరో ఫేక్ వీడియో..

‘రూ.22 వేలతో ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించండి రూ.25 లక్షలు మీ సొంతం చేసుకోండి’ అంటూ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఏఐ ద్వారా వీడియో తయారు చేసిన సైబర్ ఫ్రాడ్స్ దానిని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తున్నట్లు సైబర్ నిపుణులు తెలుపుతున్నారు. కానీ వీడియోను సోషల్ మీడియా వేదికను నుంచి తొలగించలేదు. ఇవే కాకుండా డీప్ ఫేక్ వీడియో.. ఏఐ సాయంతో ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు చెప్పినట్లు వీడియోలు తయారు చేసి వాటిని అమాయకులకు పంపించి మోసం చేసిన ఘటనలు అనేకంగా ఉన్నాయి.

ఐఏఎస్, ఐపీఎస్‌ల పేరుతో ఫేక్ ఐడీలు

పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల పేరుతో ఇటీవల కొందరు సైబర్ ఫ్రాడ్స్ ఫేక్ ఐడీలు తయారు చేశారు. వాటితో వాట్సాప్, ఫేస్ బుక్‌, మేసేంజర్ నుంచి పలువురికి మెసేజ్‌లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బులు అవసరం ఉన్నాయి.. పంపండి అని, తక్కువ ధరకు ఫర్నీచర్ అమ్మకానికి ఉందంటూ మెసేజ్‌లు చేస్తూ బాధితుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ పేరుతో పదుల సంఖ్యలో ఫేస్‌బుక్ అకౌంట్స్ తయారు చేసినట్టు తెలుస్తుంది. ఆయన పేరుతో సందేశాలు రావడంతో డబ్బులు పంపి మోసపోయిన వారు సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన ఘటనలు ఉన్నాయి.

నియంత్రణా చర్యలేవి?

సైబర్ మోసాలు జరుగుతున్నా, సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు అందుతున్నా నియంత్రణా చర్యలు చేపట్టడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నట్టు ఆరోపణలున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ఫేస్ బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ఎక్స్ వంటి వాటిని సంప్రదించి కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సైబర్ క్రైమ్ బాధితులు తెలుపుతున్నారు. డిజిటల్ అరెస్టు మోసాలపై సుప్రీంకోర్టు స్పందించాలని బాధితులు కోరుతున్నారు.

ఐటీ యాక్ట్‌ పరిధిలో చట్టపరమైన చర్యలు

ఆర్థిక పరమైన నష్టాల నుంచి సామాన్యులను కాపాడేందుకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వంటి నియంత్రణ సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పెట్టుబడిదారులను సంప్రదించే సంస్థల యూపీఐ హ్యాండిల్స్ విషయంలో సరైన నిబంధనలు పాటించాలని స్పష్టం చేశాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మెయిటీ) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు-2021కి సవరణలను విడుదల చేసింది. డిజిటల్‌ మీడియా అకౌంట్ కోసం ఒకరి వ్యక్తిగత సమాచారంపై మరో వ్యక్తికి ఎలాంటి హక్కూ ఉండదని పేర్కొంది. వీటిని ఉల్లంఘిస్తూ ఎవరైనా వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలిగించడానికి వీల్లేదని పేర్కొంది. పేటెంట్, ట్రేడ్‌మార్క్, కాపీరైట్‌ వంటి యాజమాన్య హక్కులను ఉల్లంఘించేందుకు డిజిటల్‌ మీడియాను వాడుకుంటే ఐటీ యాక్ట్‌ పరిధిలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఏఐ వీడియోలకు కొత్త డ్రాఫ్ట్ రూల్స్

వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఏఐతో రూపొందించిన వీడియోలు, ఫొటోలపై స్పష్టమైన లేబుల్ ఉండాలని కొత్త డ్రాఫ్ట్ రూల్స్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ లేబుల్ స్క్రీన్‌లో కనీసం 10% స్పేస్‌ను కవర్ చేయాలని సూచించింది. కంటెంట్ వీడియో ఏఐతో రూపొందించినట్టు చూపించాలని, లేబుల్ తొలగించేందుకు వీలు లేకుండా ఉండాలని తెలిపింది. యూజర్లు ఫేక్ కంటెంట్ అప్‌లోడ్ చేస్తే అది ఏఐతో రూపొందించినట్టు స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఆటోమేటెడ్ టూల్స్‌ ద్వారా ఫేక్ కంటెంట్‌ అరికట్టాలని పేర్కొంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఆర్థిక మోసాల కట్టడికి కళ్లెం పడటం లేదని సైబర్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యల ద్వారానే నియంత్రణలో వస్తాయని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఫేక్ మెసేజ్‌లు, వీడియోలు నమ్మొద్దు

పెట్టుబడులపై సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఫేక్ వీడియోలను నమ్మొద్దు. పెట్టుబడులు పెట్టండి అంటూ వాట్సాప్ ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చే మెసేజ్‌లతో అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వంటి ప్రముఖుల పేరుతో ఫేక్ వీడియోలు ప్రసారం అవుతున్నాయి. అలాంటి వాటిని నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు. సోషల్ మీడియా ద్వారా తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లతో అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్ చెల్లింపులు చేసే అంశంలోనూ జాగ్రత్తగా ఉండాలి. - సాయి శ్రీ, డీసీపీ సైబర్ క్రైమ్, సైబరాబాద్ కమిషనరేట్

Next Story