కేంద్ర బడ్జెట్ మిగులు నిధులు రాష్ట్రానికి రాబట్టాలి.. సీఎస్ రామకృష్ణ రావు ఆదేశాలు

by Ramesh Naini |

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రాష్ట్రానికి దక్కాల్సిన నిధులను గరిష్టంగా సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ( సీఎస్) కె. రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు.

కేంద్ర బడ్జెట్ మిగులు నిధులు రాష్ట్రానికి రాబట్టాలి.. సీఎస్ రామకృష్ణ రావు ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రాష్ట్రానికి దక్కాల్సిన నిధులను గరిష్టంగా సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ( సీఎస్) కె. రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంలో వినియోగం కాకుండా ఉన్న మిగులు నిధులను రాష్ట్రానికి మళ్లించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. డా. బీ.ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో సీఎం ఆదేశాల మేరకు వివిధ శాఖల కార్యదర్శులతో సీఎస్ మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ. 5 లక్షల కోట్లలో, జనాభా ప్రాతిపదికన తెలంగాణకు కనీసం రూ. 25 వేల కోట్లు రావాల్సి ఉందని సీఎస్ స్పష్టం చేశారు. ఈ నిధులను పొందేందుకు ప్రతి శాఖ పకడ్బందీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

రావాల్సిన రూ. 10 వేల కోట్ల బకాయిలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావాల్సిన మరో రూ. 10 వేల కోట్ల బకాయిల కోసం కార్యదర్శులు ప్రత్యేక కృషి చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చిన ఫార్మా రంగాభివృద్ధి, సెమీ కండక్టర్ తయారీ, వ్యవసాయ రంగాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ టెంపుల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని, మామునూరు ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తున్నందున ఈ ప్రాంతాల్లో టూరిజం, వాణిజ్య రంగాలను బలోపేతం చేయాలని సూచించారు. 16వ ఆర్థిక కమిషన్ మార్గదర్శకాల ప్రకారం 2011 జనాభా, డెమోగ్రాఫిక్ పనితీరు, పథకాల అమలు సామర్థ్యం ఆధారంగా నిధుల కేటాయింపు ఉంటుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్‌లు సి.వి. ఆనంద్, వికాస్ రాజ్, జయేష్ రంజన్, సవ్య సాచి ఘోష్, అహ్మద్ నదీమ్, ముఖ్య కార్యదర్శులు సందీప్ సుల్తానియా, నవీన్ మిట్టల్, ఎన్. శ్రీధర్ వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

Next Story