కేంద్ర బకాయిలు, నిధులు రాబట్టాలి.. మార్చి నుంచి 100 డేస్ యాక్షన్ ప్లాన్ : సీఎస్ రామకృష్ఱ రావు

by Ramesh Naini |

సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మార్చి 2 నుంచి జూన్ 2వ తేదీ వరకు వివిధ అభివృద్ధి పనులపై వివిధ డిపార్ట్మెంట్‌ల వారీగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

కేంద్ర బకాయిలు, నిధులు రాబట్టాలి.. మార్చి నుంచి 100 డేస్ యాక్షన్ ప్లాన్ : సీఎస్ రామకృష్ఱ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో వివిధ విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సీఎస్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, నిధులు మార్చి నెలాఖరులోగా సమీకరించు కునేందుకు ప్రణాళిక బద్దంగా పనిచేయాలని సీఎస్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఎస్ఎన్ఎ నిధులు, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్, ఇతర పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి సారించి, దీనిపై ఢిల్లీలో ఒక ప్రత్యేక అధికారిని నియమించుకొని సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, విద్య, వైద్యారోగ్య,గిరిజన సంక్షేమ శాఖల వారీగా కేంద్రం నుంచి సుమారు 15 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, వాటిని సమీకరించుకొని రాష్ట్రంలోని పెండింగ్ పనులకు ఖర్చు చేయాలని సూచించారు.

100 వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక..

సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మార్చి 2 నుంచి జూన్ 2వ తేదీ వరకు వివిధ అభివృద్ధి పనులపై వివిధ డిపార్ట్మెంట్‌ల వారీగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాలలో ఈ ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇటీవల గ్రామ పంచాయతీ, మున్సిపల్ లోకల్ బాడీస్ ఎన్నికలు ముగిసినందున ప్రజాప్రతినిధులకు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అవగాహన కల్పించేందుకు 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఉపకరిస్తుందని సీఎస్ తెలిపారు. గ్రామాల్లో,పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, రోడ్ల మరమ్మతులు, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీటి ఎద్దడి లేకుండాకు తగు చర్యలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఈ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. రానున్న కేబినెట్ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలను మంగళవారం సమర్పించాలని సీఎస్ సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, సి.వీ.ఆనంద్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ముఖ్య కార్యదర్శులు సందీప్ సుల్తానియా, అహ్మద్ నదీమ్, ఎన్. శ్రీధర్, యోగితారాణా, కార్యదర్శులు క్రిస్టినా చోంగ్తు, టికె శ్రీదేవి, స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు.

Next Story