- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం: ఒడిశా, హర్యానాలో హైడ్రామా
దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 18, ఇండియా కూటమి 16 స్థానాలు గెలుచుకున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఎక్కువ రాష్ట్రాల్లో ఓటింగ్‌కు ముందే ఫలితాలు దాదాపు ఖరారయ్యాయి. మొత్తం 26 మంది అభ్యర్థులు ఎలాంటి పోటీ లేకుండానే ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. మిగిలిన 11 స్థానాలకు మాత్రమే ఓటింగ్ జరిగింది. ప్రధానంగా బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో పోటీ కనిపించింది. ఓటింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఓటింగ్ చేపట్టారు. సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 18, ఇండియా కూటమి 16, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు.
బీహార్ నుంచి నితీష్ కుమార్ విజయం..
బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మొత్తంగా 5 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ సాధించింది. సీఎం నితీష్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌లు 44 మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. అలాగే ఈ రాష్ట్రం నుంచి జేడీయూ నేత రామ్‌నాథ్ ఠాకూర్, ఆర్ఎల్‌ఎమ్ నేత, ఉపేంద్ర కుష్వాహా, బీజేపీ నేత శివేశ్ రామ్‌లు గెలుపొందారు.
ఒడిశా, హర్యానాలో గందరగోళం
ఒడిశా రాజ్యసభ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వివాదం నెలకొంది. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. 11 మంది విపక్ష ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలుస్తోంది. మొత్తంగా ఈ రాష్ట్రంలోని 4 స్థానాల్లో ఎన్డీఏ కూటమి 3 స్థానాలను, బీజేడీ కేవలం ఒక స్థానానికి పరిమితమైంది. క్రాస్ ఓటింగ్ జరగకపోయి ఉంటే బీజేడీకి మరో సీటు లభించేది. అలాగే హర్యానాలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొంత సమయం నిలిచిపోయింది. ఓటింగ్ గోప్యత ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కమిషన్ ఈ అభ్యంతరాలను పరిశీలించి క్లియరెన్స్ ఇచ్చింది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి.
ప్రముఖల విజయం..
ఈ ఎన్నికలలో శరద్ పవార్, వినోద్ తావ్డే, తిరుచ్చి శివ, రామ్‌దాస్ అథవాలే వంటి ప్రముఖ నాయకులు రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ మనూ సింఘ్వి, వేమ్ నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఆరు మంది అభ్యర్థులు ఎలాంటి పోటీ లేకుండానే రాజ్యసభకు ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ 4, బీజేపీ 1 స్థానంలో గెలుపొందింది.






