‘ఆరోజు వద్దన్నారు కాబట్టే.. ప్రధానిని కేసీఆర్ ఆహ్వానించడం లేదు’

by Disha Web Desk 2 |
‘ఆరోజు వద్దన్నారు కాబట్టే.. ప్రధానిని కేసీఆర్ ఆహ్వానించడం లేదు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ బయోటిక్‌కు గతంలో మోడీ వచ్చినప్పుడు కేసీఆర్‌ను వద్దనడంతో కలత చెందారని, అందుకే పీఎంను ఆహ్వానించేందుకు రావడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పీఎం రాష్ట్రానికి వస్తే సీఎంలు ఆహ్వానం పలకాలని ఏ చట్టంలో ఉందన్నారు. రాష్ట్రప్రతినిధిగా తాను వెళ్లి స్వాగతం పలికినట్లు తెలిపారు. ప్రోటోకాల్ ఉల్లంఘనకు తెర లేపింది మోడీయే అన్నారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి పరులంతా బీజేపీలోనే ఉన్నారన్నారు. ఏం చేయకుండా తిట్టడానికే తెలంగాణకు వస్తున్నారన్నారు. విభజన చట్టం హామీలపై మోడీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. మోడీ మాట్లాడిన మాటలపై మేము చర్చకు సిద్ధం.. ఎవరి వాదనలో బలమెంతో చూసుకుందామన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి కాదు.. కనీసం సికింద్రాబాద్‌కు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. మోడీ బాధ్యతా రహిత్యంగా మాట్లాడారన్నారు. తిట్టాలనుకుంటే ఢిల్లీలో ఉండి తిట్టుకోవచ్చు.. దానికి హైదరాబాద్ రావాలా అన్నారు. కేసీఆర్‌ను తిడితే ప్రజలే తిరగబడతారన్నారు. అదానీ మోసాలపై జేపీసీ వేయమంటే ఎందుకు వేయరని ప్రశ్నించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రం నిధులు ఇవ్వకున్నా ఫర్వాలేదు కానీ, రాష్ట్రాన్ని బద్నాం చేయడం మానుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ తపనంతా తెలంగాణ అభివృద్ధే అన్నారు. మోడీ రాష్ట్రానికి వచ్చి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారనుకుంటే తిట్టి పోయారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ పాలనను మెచ్చుకున్నది ప్రధాని మోడీయే కదా, ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప మోడీకి ఏమీ చేత కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే కేంద్రం అవార్డులు ఎందుకు ఇస్తోందని పశ్నించారు. మోడీ సీబీఐని గతంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనలేదా? అన్నారు. జాతీయ రహదారులు తెలంగాణ హక్కు అని, కేసీఆర్‌ది కుటుంబ పాలన కాదు.. తెలంగాణ అంతా కేసీఆర్ కుటుంబమే అన్నారు. మోడీకి కుటుంబం ఉంటే రాజకీయాల్లోనే ఉండేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో చేసింది ఏమిటి కేసీఆర్ చేయంది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు వచ్చి సవాల్ చేయడం, విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. యాసంగి పంట కొనుగోలు గురించి మోడీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా రైతులను నిరాశ పరిచారన్నారు. రేషన్ కార్డుల సంఖ్యను మోడీ పెంచుతారనుకుంటే అది కూడా చేయలేదని, రేషన్ బియ్యం పై ప్రధాని పదవిలో ఉండి అబద్దాలు ఆడటం దురదృష్టకరం అన్నారు. కుటుంబానికి బియ్యం కోటా పెంచింది రాష్ట్ర ప్రభుత్వం తప్ప కేంద్రం కాదన్నారు. రేషన్ బియ్యం పై 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని స్పష్టం చేశారు. గురుకులాల గురించి మోడీ ఎందుకు మాట్లాడరో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం, పీడిఎస్ బియ్యం గురించి మాట్లాడే అర్హత మోడీ కి లేదన్నారు. వెనకబడిన వర్గాలకు మోడీ చేసింది శూన్యమన్నారు. అవినీతి బీజేపీ సీఎం ల పై సీబీఐ విచారణ ఎందుకు జరపరని ప్రశ్నించారు. మోడీ తెలంగాణకు ప్రాజెక్టులు ఇస్తారంటే ఎందుకు వద్దంటామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ యెగ్గేమల్లేశం పాల్గొన్నారు.


Next Story

Most Viewed