ఉత్తరాఖండ్‌ అడవుల్లో కార్చిచ్చు..హెలికాప్టర్లతో నీళ్ల తరలింపు

by Disha Web Desk 17 |
ఉత్తరాఖండ్‌ అడవుల్లో కార్చిచ్చు..హెలికాప్టర్లతో నీళ్ల తరలింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. శుక్రవారం మొదలైన మంటలు శనివారం నాటికి నైనిటాల్‌లో మరింత తీవ్రం కావడంతో వాటిని అదుపులోకి తీసుకురావడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సహాయం కోరింది. దీంతో భారత వైమానిక దళ సిబ్బంది Mi-17 హెలికాప్టర్‌ను ఉపయోగించినట్లు బ్యాంబి బకెట్ ఆపరేషన్‌ ద్వారా నీళ్లను మంటలపై వెదజల్లుతున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో నైనిటాల్ హైకోర్టు కాలనీ వాసులకు ముప్పు ఏర్పడింది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌పై కూడా తీవ్ర ప్రభావం పడింది.

మంటలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం నైని సరస్సులో బోటింగ్‌ను నిషేధించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మంటల కారణంగా 33.34 హెక్టార్ల అటవీ భూమి నాశనం అయింది. శుక్రవారం నుంచి నైనిటాల్‌ జిల్లాలోని 31 ప్రాంతాల్లో కొత్తగా మంటలు చెలరేగాయి. కొండ ప్రాంతాలైన భూమియాధర్, జ్యోలికోట్, నారాయణ్ నగర్, భవాలి, రామ్‌గఢ్, ముక్తేశ్వర్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

పరిస్థితిని సమీక్షించేందుకు శనివారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హల్ద్వానీలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అగ్నిప్రమాదాలు ఉత్తరాఖండ్‌కు సవాలుగా మారాయి, మంటలను ఆర్పడానికి భారత సైన్యంతో పాటు రాష్ట్రం కృషి చేస్తోంది, ఇది పెద్ద అగ్నిప్రమాదం. మేము మంటలను అదుపులోకి తీసుకురావడానికి అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. శుక్రవారం అడవులకు నిప్పు పెట్టారని అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను రుద్రప్రయాగ్‌లో అరెస్టు చేశారు.



Next Story

Most Viewed