పాకిస్తాన్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన సంస్థకు మూసీ డీపీఆర్: కేటీఆర్

by Prasad Jukanti |   (  Updated:2026-03-18 13:55:09  IST  )

మూసీ ప్రాజెక్టు డీపీఆర్ విషయంలో ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సభ నుంచి వాకౌట్ అవుతున్నామని స్పష్టం చేశారు.

పాకిస్తాన్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన సంస్థకు మూసీ డీపీఆర్: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వం చెబుతున్నదొక్కటి చేస్తున్నది మరొకటని బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ (KTR) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మూసీ డీపీఆర్ (Musi DPR) తయారు చేసేందుకే 18 నెలలు పడుతుందని జనవరిలో మంత్రి చెప్పారని ఇప్పుడేమో డీపీఆర్ పూర్తయిందని అంటున్నారన్నారు. 18 నెలలు పడుతుందని చెప్పి రెండు నెలల్లోనే పూర్తి చేశారా అని నిలదీశారు. ఇవాళ మూసీ డీపీఆర్‍పై శాసననసభలో చర్చ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ఒక వేళ డీపీఆర్ పూర్తయి ఉంటే సభ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ మాకు ఇంతవరకు అందలేదని ఏడీపీ చెబుతోందని, డీపీఆర్ తయారుకాకుండా తయారైందని చెప్పి సభను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. మూసీ డీపీఆర్ బాధ్యతలను మెయిన్ హార్ట్ సంస్థకు అప్పగించారు. కానీ ఈ సంస్థపై పాకిస్థాన్ ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు పెట్టిందన్నారు.

అందుకే సభ నుంచి వాకౌట్:

మూసీలో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి మేము తీవ్రంగా వ్యతిరేకం అని అందుకే ఈరోజు సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్ని ఇళ్లు కూలగొడుతున్నారు అనేది కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీకీ డీపీఆర్ లేదని అంటున్నాడు. ప్రభుత్వం ఫైవ్ స్టార్ హోటళ్లలో ప్రజెంటేషన్ వద్దు, బాధితులతోనే ప్రజలతోనే పెట్టాలని మేము డిమాండ్ చేశాము. అందుకే ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‍కు మేము హాజరు కాలేదన్నారు. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్ పార్టీనే అని ధ్వజమెత్తారు. 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ నగర్‍కు నోటీసులు ఇచ్చారని 14,00 ఇళ్లు కూల్చివేస్తామని చెప్పి 10,000 ఇళ్లకు పైగా సంబంధించి నోటీసులు ఇచ్చారన్నారు. ఖమ్మం జిల్లాలో, సొంత జిల్లాలో ఇళ్లు కూలగొడితే ఉప ముఖ్యమంత్రికి కనీసం సమాచారం లేదని విమర్శించారు. ఏడిబి (ADB) లోన్ లేదన్నారు. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేదని ఆరోపించారు.

Next Story