ఏదో వెలగబెట్టినట్లు సంతోషం? రైలు వెళ్తుండగా పట్టాలపై పడుకుని రీల్ : వీసీ సజ్జనార్

by Ramesh Naini |   (  Updated:2025-05-12 17:23:18  IST  )

సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఫేమస్ అవ్వడం కోసం కొంత మంది యువత వెర్రి చేష్టలతో రీల్స్ చేస్తున్నారు.

ఏదో వెలగబెట్టినట్లు సంతోషం? రైలు వెళ్తుండగా పట్టాలపై పడుకుని రీల్ : వీసీ సజ్జనార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో యువత రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఫేమస్ అవ్వడం కోసం కొంత మంది యువత వెర్రి చేష్టలతో రీల్స్ చేస్తున్నారు. వారు ఫేమస్ కావాలని వారి ప్రాణాలను పణంగా పెట్టడం లేదా ఇతరుల ప్రాణలను రిస్క్‌లో పెట్టడం కొంత మంది చేస్తుంటారు. ఇప్పటికే స్టంట్స్ రీల్స్ చేసిన కొంత మంది యువత ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై ప్రమాదకర సంస్ట్‌కు నెటిజన్లు (Reel of a young man on the train tracks) అతనిపై విరుచుకపడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఆదివారం ఎక్స్ వేదికగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ (VC Sajjanar) పోస్ట్ చేశారు. వీడియోలో ఓ యువకుడు రైలు వెళ్తుండగా ట్రాక్ మధ్యలో నిలువుగా పడుకున్నాడు.

కొంత సమయం తర్వాత ట్రైన్ యువకుడిపై నుంచి వెళ్లిపోయాక లేచి నిలబడి ఏదో సాధించినట్లుగా విజయ సంకేతం ఇస్తాడు. దీనిపై వీసీ సజ్జనార్ ట్వీట్ చేస్తూ.. ‘ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం, సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా? ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ కోసం పిచ్చి పరాకాష్టకు చేరిందని ఇలాంటి వారిని అరెస్ట్ చేయాలని రైల్వే శాఖ, ఆర్‌పీఎఫ్ సిబ్బందికి ఎక్స్ వేదికగా నెటిజన్లు ట్యాగ్ చేశారు. ఇలాంటి వాళ్లను మీరు తప్పనిసరిగా అరెస్ట్ చేయాలని, లేకపోతే వీడిని చూసి ఇంకో పది మంది ఇలా చేస్తారని పలువురు నెటిజన్‌లు కామెంట్స్ పెట్టారు. కాగా, ఈ వీడియో పశ్చిమ బెంగాల్‌కు చెందినట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు.

Next Story