- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిప్పల్ కోటి రిజర్వాయర్ బాధితులకు పరిహారం చెల్లించాలి.. సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం లేఖ
పిప్పల్ కోటి రిజర్వాయర్ నిర్మాణం బాధితులకు పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఎం కోరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: పిప్పల్ కోటి రిజర్వాయర్ నిర్మాణం బాధితులకు పరిహారం చెల్లించాలని (CM Revanth Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఎం (CPM) కోరింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్‌కోటి రిజర్వాయర్‌లో నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం తక్షణమే పరిహారం, ప్రాజెక్టు పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆదివారం ఒక లేఖ రాశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల జీవనపరిస్థితులు దయనీయంగా వున్నాయి. 2018లో ఎగువన పిప్పల్‌కోటి రిజర్వాయర్ కరకట్ట పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటి వరకు భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందలేదు. పరిహారం వస్తుందన్న భరోసాతో ఎంతో మంది అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చలేక ఇప్పటికే నలుగురు రైతులు కూడా మరణించారు. తక్షణమే తమరు జోక్యం చేసుకొని భూములు కోల్పోయిన రైతులకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
పెన్‌గంగా నదిపై చనాఖ-కోర్ట గ్రామాల మధ్య బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టారు. మొదట 0.8 టీఎంసీల సామర్థంతో నిర్మాణం పనులు మొదలు పెట్టి, వర్షాకాలంలో 5 టిఎంసీలకు పైగా నిల్వ చేసే విధంగా పిప్పల్‌కోటి రిజర్వాయర్ కరకట్ట పనులు ప్రారంభించారు. 1.4 టీఎంసీల నిల్వ సామర్థ్యం కోసం 1200 ఎకరాల్లో రిజర్వాయర్‌ను, 180 ఎకరాల విస్తీర్ణంలో 4.2 కీలోమీటర్ల పొడవుతో కరకట్ట నిర్మాణాన్ని చేపట్టారు. ఇది కాకుండా కాల్వలు, నీటి నిల్వ కోసం మరో వెయ్యి ఎకరాల భూ సేకరణకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ మొత్తం 198 మంది రైతుల నుంచి భూసేకరణ చేశారు. తొమ్మిది నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ, సంవత్సరాలు గడిచినా పూర్తి కాలేదు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.369 కోట్ల నుంచి రూ.800 కోట్లకు పెరిగింది. కరకట్ట నిర్మాణానికి తీసుకున్న భూములకు 2018లో అప్పటి ప్రభుత్వం ఎకరాకు రూ.8 లక్షలు చెల్లిస్తామని చెప్పారు. 7.8 లక్షలు ఇస్తామని జీవో నెం.120 తెచ్చింది. ఒకవైపు భూముల విలువలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రు.18 లక్షలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నష్టపరిహారం కోసం మూడేండ్ల క్రితమే రైతులు నెలరోజుల పాటు నిరసనలకు దిగారు. అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు రైతులకు మద్ధతు ప్రకటిస్తూ, తాము అధికారంలోకి రాగానే సమస్య పరిష్కరిస్తామన్నారు. నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో బాధిత రైతులు మలి దఫా పోరాటాన్ని ప్రారంభించారు. తక్షణమే మీరు జోక్యం చేసుకుని నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి, రిజర్వాయర్ పనులను సత్వరమే పూర్తిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.






