బుల్డోజర్ సంస్కృతిని వ్యతిరేకించే మీరే ఇలా చేయడం బాగోలేదు: సీఎం రేవంత్‌కు బీవీ రాఘవులు లేఖ

by Gantepaka Srikanth |

కూల్చివేతలో నష్టపోయిన బాధితులకు ప్రస్తుతం సరైన భోజనం, వసతి సౌకర్యాలు కల్పించాని సీఎం రేవంత్‌కు బీవీ రాఘవులు లేఖ.

బుల్డోజర్ సంస్కృతిని వ్యతిరేకించే మీరే ఇలా చేయడం బాగోలేదు: సీఎం రేవంత్‌కు బీవీ రాఘవులు లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మం కార్పొరేషన్, వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో గత 12 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న సుమారు 700 మంది పేదల ఇండ్లు కూల్చివేశారని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కోరారు. ఘటనపై ఆదివారం సీఎంకు లేఖ రాశారు. పోలీసు, రెవెన్యూ సిబ్బంది కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. భూదాన యజ్ఞ బోర్డుకు చెందిన భూములని, 2014లోనే ఈ బోర్డు చైర్మన్ రాజేందర్‌రెడ్డి అక్కడి పేదలకు ఇంటి స్థలం కోసం 100 గజాల చొప్ప్పున మంజూరు చేసినట్లు తెలిసిందని పేర్కొన్నారు. కూల్చివేతలో నష్టపోయిన బాధితులకు ప్రస్తుతం సరైన భోజనం, వసతి సౌకర్యాలు కల్పించాని లేఖలో కోరారు.

వారికి అదే భూదాన భూముల్లో పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. విలువైన భూములనే పేరుతో పేదలను అక్కడి నుండి తొలగించటం సరైంది కాదని పేర్కొన్నారు. శనివారం ఆ ప్రాంత సందర్శనకు వెళ్ళానని, అది యుద్ధంలోనో, భారీ భూ కంపంలోనో నాశనమైనట్లు బీభత్సంగా ఉందని ప్రస్తావించారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉండి బుల్డోజర్ సంస్కతిని వ్యతిరేకిస్తున్న మీరు, మీ ప్రభుత్వం ఈ విధంగా పేదల పట్ల అమానుషంగా వ్యవహరించటం దారుణమైన విషయం అని పేర్కొన్నారు. భాదితులకు తాత్కాలిక ఆశ్రయం కల్పించిన అంబేద్కర్ భవన్, టీటీడీసీలలో కూడా, సరైన వసతి, భోజన ఏర్పాట్లు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేదని తెలిపారు. అక్కడ ఉన్నవారు అనారోగ్యం పాలవుతున్నట్లు తెలిపారు.

Next Story