రాహుల్‌ గాంధీపై వేటు అప్రజాస్వామిక చర్య: తమ్మినేని

by Disha Web Desk 2 |
రాహుల్‌ గాంధీపై వేటు అప్రజాస్వామిక చర్య: తమ్మినేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ ఆదేశాలతో రాహుల్‌గాంధీని పార్లమెంట్‌ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడం అప్రజాస్వామిక దుశ్చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో రాజకీయ ప్రతిపక్షాలను, ప్రతిపక్ష ప్రభుత్వాలను, వారికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులను కేంద్ర బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థ సంస్థలైన ఈడీ, సీబీఐలను తమ చేతుల్లోకి తీసుకుని దాడులు చేయిస్తూ, అక్రమ కేసులతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. బీజేపీలో చేరినవారి కేసులకు క్లీన్‌చిట్‌ ఇస్తూ, లొంగనివారిని అరెస్టులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాదని తెలిపారు.

దేశ సంపదను కొల్లగొడుతున్న అదానీపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలని పార్లమెంట్‌లో అన్ని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయని, కానీ దానిని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ దురహంకార వ్యవహారంలో భాగంగానే రాహుల్‌గాంధీపై నేరపూరిత పరువునష్టం మార్గాన్ని ఎంచుకున్నారని, పార్లమెంట్‌ సభ్యత్వాన్ని తొలగించే దుశ్చర్యకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పూనుకున్నదని విమర్శించారు. ఈ నిరంకుశ, ఫాసిస్టు పాలనతో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందన్నారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ అప్రజాస్వామిక చర్యలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని పిలుపునిచ్చారు.

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

రాష్ట్రంలో విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చాలాకాలంగా ఆందోళనలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడం సరైందికాదని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని, ఆర్టిజన్స్‌గా ఉన్నవారిని కన్వర్షన్‌ చేయాలని, కనీసం 30 శాతమైన ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, గత 20 ఏళ్ళుగా సంస్థను నమ్ముకుని పని చేస్తున్న రెవెన్యూ క్యాషియర్స్‌, స్పాట్‌ బిల్డింగ్‌ కార్మికులు, అన్‌మెన్డ్‌ కార్మికులను ఆర్టిజన్స్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపి వారి సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed