CPIM: స్థానిక ఎన్నికల బ్రేక్‌కు బీజేపీనే కారణం

by Gantepaka Srikanth |

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద హైకోర్టు(TG HighCourt) స్టే విధించడంతో, రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి.

CPIM: స్థానిక ఎన్నికల బ్రేక్‌కు బీజేపీనే కారణం
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద హైకోర్టు(TG HighCourt) స్టే విధించడంతో, రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. ఇప్పటికైనా రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, మంత్రులు నైతిక బాధ్యత వహించి, వారి పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) ప్రకటన విడుదల చేశారు.

‘సామాజిక న్యాయం కోరే శక్తులు, ప్రజాస్వామికవాదులంతా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు పోరాటాలకు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధమైన చర్యలన్నీ తీసుకోవాలని డిమాండ్ చేసింది. కులగణన, సర్వే నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపించినా స్పందించలేదు. శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి ఆర్డినెన్స్ చేసి గవర్నర్కు పంపించినా ఆమోదించకపోవడం వల్లే రిజర్వేషన్లు ఆగిపోయాయి. బీజేపీ కులతత్వ, మనువాద పార్టీ అయినందున, కుల వ్యవస్థ, అసమానతలు ఉండాలని, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని కోరుకుంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు రావాల్సిన హక్కులన్నింటినీ కాలరాస్తున్నది. రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండడం వల్లనే ఈరోజు ఈ రిజర్వేషన్లు అమలు కాని పరిస్థితి ఏర్పడింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీకి పుట్టగతులు లేకుండా చేస్తేనే సాధ్యం’ అని జాన్ వెస్లీ అన్నారు.

Next Story