CPM: ఆర్టీసీ ఛార్జీల పెంపుదలను వెంటనే విరమించుకోవాలి.. సీపీఎం డిమాండ్

by Ramesh Naini |

హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాల్లో టీజీఎస్ఆర్టీసీ ఛార్జీలు మొదటి మూడు స్టేజీలకు రూ.5, నాలుగో స్టేజీకి రూ.10 చొప్పున పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఎం వ్యతిరేకించింది.

CPM: ఆర్టీసీ ఛార్జీల పెంపుదలను వెంటనే విరమించుకోవాలి.. సీపీఎం డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాల్లో (TGSRTC) టీజీఎస్ఆర్టీసీ ఛార్జీలు మొదటి మూడు స్టేజీలకు రూ.5, నాలుగో స్టేజీకి రూ.10 చొప్పున పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని (CPM) సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. పెంచిన ఛార్జీలను వెంటనే విరమించుకోవాలని సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు ఆదివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ (John Wesley) ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త డిపోలు, కొత్త ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటుకు రూ.392 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ ఛార్జీలను పెంచుతున్నట్లు, అందుకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాదులో ఎలక్ట్రికల్‌ బస్సు చార్జీలను, బస్సు పాస్‌ చార్జీలను భారీగా పెంచిందని, అలాగే పండుగల పేరుతో ప్రజల నుంచి 50 శాతం ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తున్నారని గుర్తుకు చేశారు. మౌలిక సదుపాయాలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా ప్రజలపై మరోసారి అదనంగా భారాలు వేయడం సమంజసం కాదని సూచించారు.

ఆర్టీసీలోనే కార్గో సేవలు కొనసాగించాలి..

ఆర్టీసీలో కార్గో సర్వీసులను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆయన తెలిపారు. కార్గో సేవలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలను విరమించుకొని ఆర్టీసీలోనే కార్గో సేవలు కొనసాగిస్తూ ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని రిక్రూట్‌ చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story