- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్‌తో చర్చలు జరిపారు.. మావోయిస్టులతో జరపడానికి ఏంటి బాధ: CPI Telangana
ఛత్తీస్‌గఢ్‌లో సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా మరో 27 మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేయడం పట్ల సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా మరో 27 మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేయడం పట్ల సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి చర్చలకు సిద్ధమేనని మావోయిస్టులు ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎన్ కౌంటర్లు చేయడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. సమాజంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయ వాదులు, మేధావులు రచయితలు తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నప్పటికీ కేంద్రం మొండివైఖరి ప్రదర్శించడాన్నీ తీవ్రంగా ఖండించారు. ఎలాంటి సమస్యకైనా చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చరిత్ర రుజువు చేస్తుందని కూనంనేని అన్నారు. తక్షణమే ఆపరేషన్ కగారు నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని కూనంనేని సాంబశివరావు కోరారు.
చర్చలు జరపండి: చాడ డిమాండ్
ఎన్కౌంటర్ చేయకుండా మావోలతో చర్చలు జరపాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలోని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు మావోయిస్టుల, వామపక్ష భావజాలాన్ని అంతం చేయడం లక్ష్యంగానే ఆపరేషన్ కగార్ చేపట్టి విచ్చలవిడిగా మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు. ఉగ్రవాదుల కంటే దారుణంగా మావోయిస్టులపై సీత కన్ను ప్రదర్శిస్తున్నారని అన్నారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ఒక నెల రోజులు కింద ప్రకటించినా చర్చలు జరపకుండా మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా ఎన్కౌంటర్ల పరంపర కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులు నమ్మిన సిద్ధాంతం కోసం ఆ మార్గం ఎంచుకున్నారన్నారు. దేశం, రాష్ట్రంలో బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు శాంతి చర్చలు జరపాలని కోరుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ అహం దెబ్బతింటుందోనని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతున్నారు తప్ప, మన భారతదేశ పౌరులైన మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపడం లేదని చాడ వెంకట్రెడ్డి ప్రశ్నించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లు పౌర హక్కులను కాల రాయడమే అవుతుందని వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.






