ఆర్టీసీనీ విలీనం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని లేఖ

by Ramesh Naini |

టీజీఎస్ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, పలు కార్మికుల ప్రధాన డిమాండ్లలతో ఆర్‌టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు.

ఆర్టీసీనీ విలీనం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఎస్ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, పలు కార్మికుల ప్రధాన డిమాండ్లలతో ఆర్‌టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. ఏప్రిల్ 13వ తేదీన లేబర్ కమిషన్ వద్ద జరిగే సమావేశానికి ఆర్‌టీసీ యాజమాన్యం హాజరై సమ్మె నివారణకు చర్చలు జరిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి సాంబశివరావు ఆదివారం లేఖ రాశారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలు

‘ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పలు దఫాలుగా చర్చలు జరిపినా వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. దీంతో కార్మికులు నిరవధిక సమ్మెకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం, రెండు వేతన సవరణల అమలు, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘ ఎన్నికల నిర్వహణ, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రయాణీకుల సౌకర్యం కోసం కొత్త బస్సులు కొనుగోలు చేసి సంస్థను విస్తరిస్తామన్నారు. కానీ అలాంటి హామీలు ఏవీ అమలు కాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆర్టీసీలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో అద్దె వాహనాలను తీసుకొస్తున్నారు. ఈ బస్సులో పనిచేస్తున్న డ్రైవర్స్ ఆర్టీసీకి సంబంధం లేదు. ఈ బస్సుల మీద ప్రభుత్వ ఇస్తున్న సబ్సిడీ ప్రైవేట్ వ్యక్తులకే చెందుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వం తీసుకుని ఆర్‌టీసీకి ఇవ్వడం వలన ఆదాయం కూడా సంస్థకు చెందుతున్నది. ఆర్టీసీలో ప్రైవేట్ గుత్తాధిపత్యం కూడా తగ్గుతుంది’ అని ఆయన తెలిపారు.

‘గత 11 ఏళ్లుగా ఆర్టీసీలో నియామకాలు లేకపోవడంతో ఉద్యోగులపై పని భారం పడుతున్నది. దీంతో కార్మికులు తీవ్ర అనారోగ్యాలుకు గురై తున్నారు. పీఎఫ్‌కు సంబంధించి ఉద్యోగస్థుల నుండి రికవరి చేసిన సుమారు రూ.1200 కోట్లను యాజమాన్యం రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్‌కు పంపకపోవడం వలన చాలా మంది ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్లు గత 5 సంవత్సరాలుగా విడుదల కాలేదు. కార్మికులు అనేక సమస్యలు సమ్మె నోటీసులో యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 9వ తేదీన లేబర్ కమిషన్ వద్ద జరిగిన సమావేశానికి ఆర్‌టీసీ యాజమాన్యం రాకపోవడంతో తిరిగి 13వ తేదీకి సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సమావేశంలో సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులు సమ్మెకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కావున ఆర్‌టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళకుండా చర్చలు జరిపి వారి డిమాండ్ల సాధనకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి’ అని సీఎంకు రాసిన లేఖలో సాంబశివరావు పేర్కొన్నారు.

Next Story