మహిళా రెజ్లర్లపై దాడి అత్యంత అమానుషం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

by Disha Web Desk 19 |
మహిళా రెజ్లర్లపై దాడి అత్యంత అమానుషం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక వైపు నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం జరుపుకుంటూ, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన చేస్తున్న మహిళ రెజ్లర్లపై అరాచక పద్ధతులలో దాడి చేయడం అత్యంత అమానుషమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళ రెజ్లర్లపై పోలీసుల దాడి, అక్రమ అరెస్టులు చేశారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దేశానికి ఎన్నో పతకాలు గెలిచి కీర్తి సంపాదించి పెట్టిన క్రీడాకారులపై రెజ్లర్ల శిక్షణ విభాగానికి చీఫ్ కోచ్‌గా ఉన్న ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, గత 35 రోజులుగా రెజ్లర్లు తీవ్ర నిరసన తెలుపుతున్నా, దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహవేషాలు వ్యక్తం చేస్తున్నా ఇప్పటికీ ఎంపీని అరెస్టు చేయకపోవడం మహిళల పట్ల బీజేపీకి ఉన్న వైఖరికి అద్దం పడుతున్నదని విమర్శించారు.

ప్రశ్నించే వాళ్ళని నిర్బంధించబడుతుంటే, తప్పు చేసిన వారు రాజులాగా యదేచ్ఛగా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. బేటి బచావో బేటి పడావో అనే పేరుతో ఆడపిల్లలను చదివించు, రక్షించు అని చెబుతూనే మహిళలను భక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ నైతిక బాధ్యత వహించి మహిళలకు క్షమాపణ చెప్పాలని, బ్రిజ్ భూషణ్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.Next Story