గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి : కూనంనేని సాంబశివరావు

by Disha Web Desk 5 |
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి : కూనంనేని సాంబశివరావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని, ప్రజాస్వామ్యానికి గుదిబండగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరంగా మారిన గవర్నర్ వ్యవస్థ పై త్వరలో ఒక సెమినార్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. విజయవాడలో అక్టోబర్ 14 నుంచి 18 తేదీల్లో జరగనున్న సీపీఐ జాతీయ మహాసభ గౌరవార్థం హైదరాబాద్ ఈ సెమినార్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సెమినార్ మేధావులను, ఇతర ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. పాదయాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని, ఆయన తెలివి తక్కువగా మాట్లాడుతున్నారని, ఒక రోగ్ లాగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

తెలంగాణ ప్రజలకు, నాటి సాయుధ పోరాట చర్రితకు, సమాజానికి అన్యాయం చేసిన బీజేపీకి చెందిన బండి సంజయ్‌కు పాదయాత్ర చేసే అర్హత లేదన్నారు. 80 శాతం హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలంటూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఐలమ్మ, దొడ్డి కొమరయ్యలను బీజేపీ నేతలు కించపరిచే విధంగా మాట్లాడారని, ఇందుకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా సాయుధ పోరాట వీరుల స్మారక చిహ్నాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడాన్ని కూనంనేని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టాలను, రైతులు తిప్పికొట్టిన మూడు నల్ల చట్టాలను దొడ్డిదారిలో అమలుకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు. అందులో భాగంగానే ప్రైవేటు కంపెనీల డిస్కామ్ ద్వారా విద్యుత్ పంపిణీలోకి ప్రవేశించేలా నోటిఫికేషన్ విడుదల చేసిందని, అలాగే ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిందన్నారు.

'ధరణి' లొసుగులను పరిష్కరించాలి: చాడ వెంకట్ రెడ్డి

ధరణి పోర్టల్ అనేక లొసుగులు ఉన్నాయని, ఫలితంగా అనేక మంది ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్నారని చాడ వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ధరణిలో సమస్యలను తక్షణ పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడి అన్యాక్రాంతమవుతున్నాయని, జిల్లాలో ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ పేదలకు పంచేందుకు పూనుకోవాలని సీపీఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోడు భూముల సమస్యలు కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా కలుపుకొని బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేస్తామని అజీజ్ పాషా అన్నారు. మీడియాలో ద్వేషపూరిత చర్చలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం మంచి పరిణామమని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పశ్య పద్మ, ఎన్.బాలమల్లేశ్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఇ.టి.నర్సింహా పాల్గొన్నారు.Next Story