ప్రభుత్వ సమాధానానికి వాస్తవానికి పొంతన లేదు: కూనంనేని

by Gantepaka Srikanth |

గ్యాస్, పెట్రోల్, డీజీల్ అధిక ధరలు, కొరత వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మే 6న సీపీఐ పిలుపునిచ్చిన నిరసన కార్య‌క్ర‌మాల‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో కోరారు.

ప్రభుత్వ సమాధానానికి వాస్తవానికి పొంతన లేదు: కూనంనేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్యాస్, పెట్రోల్, డీజీల్ అధిక ధరలు, కొరత వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మే 6న సీపీఐ పిలుపునిచ్చిన నిరసన కార్య‌క్ర‌మాల‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో పంట కోతల సమయంలో డీజీల్ లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారని, కొరత లేదని పాలకులు ప్రకటిస్తున్నప్పటికీ ఆచరణలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదని విమ‌ర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలెండర్ల ధరలను రూ. 993 పెంచడంతో రూ.3100కు చేరుకున్నదని. అలాగే డీజీల్, పెట్రోల్ మీద లీటరు రూ.5 గృహవసరాల గ్యాస్ సిలెండర్ పై రూ.50 పెంచడానికి ఆయిల్ కంపెనీలు ప్రతిపాదనలు పంపించాయని, దీంతో ప్రజల మీద మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా ఉందన్నారు. అమెరికా సామ్రాజ్యవాద విధానాలను మోడీ ప్రభుత్వం వ్యతిరేకించకపోవడంతో యుద్ధం కంటే ముందు బ్యారెల్ ముడి చముర ధర 72 డాలర్లు ఉంటే, ఇప్పుడు 126 డాలర్లకు చేరుకున్నద‌ని గుర్తు చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సెలిండర్ ధరల వలన హోటల్స్, రెస్టారెంట్లు, చిన్న పెద్ద ఆహార వ్యాపారాల మీద పడుతుందని, పెట్రోల్, డీజీల్ ధరలు పెంచినట్లయితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్భణం పెరిగి ప్రజలపై ఆర్థిక భారాలు పెరుగుతాయి అన్నారు.

అమెరికా- ఇరాన్ యుద్ధం వలన భారతదేశానికి ఎలాంటి ప్రమాదం లేదని, చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు, పెట్రోల్ బంక్‌ల వద్ద ఎందుకు బారులు తీరిన జనం ఉన్నారనేదానికి ప్రభుత్వం ఇచ్చే సమాధానానికి వాస్తవానికి పొంతన లేదన్నారు. ఈ తరుణంలో తరుణంలో మే 6వ తేదీన సీపీఐ ఆధ్వర్యంలో గ్యాస్ సిలెండర్లు, ఖాళీ క్యాన్స్ రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లా, మండల, గ్రామ/బస్తీ శాఖలలో నిరసన ధర్నాలు చేపట్టాలని కూనంనేని సాంబశివరావు ప్రజలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Next Story