సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత

by Muthe.Rajitha |   (  Updated:2025-08-22 19:50:07  IST  )

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.

సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్ : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) తుదిశ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం. నేడు పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. పాలమూరు జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి 1998, 2004లో నల్గొండ నుంచి చట్టసభలకు ఎంపిక అయ్యారు. సురవరం సుధాకర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కోన్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25లో జన్మించారు. అనంతరం వీరి కుటుంబం కాంచిపాడుకు వలస వెళ్ళింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయవిద్యలో పట్టా పొందారు. 1974లో విజయలక్ష్మితో వివాహం జరగగా.. వీరికి ఇద్దరు కొడుకులు.

సురవరం సుధాకర్ రెడ్డి తండ్రి సురవరం వెంకట్రామిరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి సుధాకర్ రెడ్డికి స్వయానా పెదనాన్న అవుతారు. అయితే సుధాకర్ రెడ్డి పోరాట యాత్ర 1957లో కర్నూలులో చదువుతున్నపుడు ప్రారంభం అయింది అని చెప్పవచ్చు. అప్పుడు పాఠశాలల్లో ప్రాథమిక అవసరాల కోసం చేసిన పోరాటం కర్నూలు మొత్తం వ్యాపించడంతో సుధాకర్ రెడ్డి పేరు మారు మోగి పోయింది. 1960లో AISF కర్నూలు పట్టణ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, అనంతరం జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 1965లో ఓయూలో లా చదువుతున్నపుడే AISF రాష్ట్ర బాధ్యతలను ఆయనకు కట్టబెట్టారు. అదే వేగంతో 1966, 1969లో జాతీయ ప్రధాన కార్యదర్శి, 1970లో జాతీయ అధ్యక్షుడు అయ్యారు.

ఆ తరువాత సురవరం ప్రస్థానం కమ్యూనిస్ట్ పార్టీకి మారింది. 1971లో భారత కమ్యూనిస్ట్ పార్టీకి జాతీయ కమిటీ సభ్యుడు అయ్యారు. 1974 నుంచి 1984 వరకు సీపీఐ పార్టీ ఉమ్మడి ఆంధ్ర కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు. 1985, 1990 లో వరుసగా రెండుసార్లు కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 1994 లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై డోన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1998లో చట్టసభలకు పోటీ చేసి తొలివిజయం దక్కించుకొని, తొలిసారి పార్లమెంటులో అడుగు పెట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2000 లోని విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో సుధాకర్ రెడ్డి కీ రోల్ ప్లే చేశారు. ఆ ఉద్యమంలో ముగ్గురు చనిపోగా సురవరంను గుర్రాలతో తొక్కించగా గాయపడ్డారు. దాని ఫలితంగా 2004లో మరోసారి నల్గొండ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అప్పుడే కార్మిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయ్యారు.

2012 లో బీహార్ లోని పాట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యి 2019 వరకు కొనసాగారు. తెలుగు రాష్ట్రాల నుంచి వామపక్ష పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన రెండో వ్యక్తి కూడా సురవరం సుధాకర్ రెడ్డి కావడం గమనార్హం. ఆయన నేతృత్వంలో పని చేసిన అనేకమంది ఆ తరువాతి కాలంలో వివిధ రాష్ట్రాల్లో కీలక నేతలుగా ఎదిగారు. విద్యార్థి స్థాయి నుంచి, జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో రాణించిన సురవరం.. చక్కటి వాగ్దాటి, విషయ పరిజ్ఞానం గల నేత. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు కూడా భారత పార్లమెంటరీ తరపున పంపబడ్డ గొప్ప నాయకుడు.

సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు ముగిసిన కొద్ది నిమిషాలకే సురవరం మరణించిన వార్త తెలియడంతో నాయకులు, కమ్యూనిస్టు శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శులు డాక్టర్‌ కె. నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు హుటాహూటిన ఆసుపత్రికి వెళ్లి సురవరం భౌతిక కాయానికి నివాళి అర్పించారు. సురవరం మరణ వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంతి ఎ. రేవంత్‌రెడ్డి, ప్రతిపక్షనేత కె. చంద్రశేఖర్‌రావు, టిపిసిసి చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, పలువురు ప్రముఖ నేతలు సంతాపం ప్రకటించారు.

కాగా సురవరం పెద్దకుమారుడు అమెరికా నుంచి రావాల్సి ఉండడంతో ఆయన అంతిమయాత్రను ఆదివారం నిర్వహించనున్నారు. అదే రోజు ఉదయం పదిగంటలకు ప్రజల సందర్శనార్థం సురవరం భౌతికకాయాన్ని సిపిఐ రాష్ట్ర కార్యాలయమైన మగ్ధూంభవన్‌కు ఉదయం 10 గంటలకు తరలించనున్నారు. మధ్యాహ్నం అంతిమ యాత్ర నిర్వహించి సాయంత్రం సురవరం సుధాకర్‌రెడ్డి భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం గాంధీ బోధానాసుపత్రికి అప్పగించనున్నారు.

Next Story