బీహార్​లో ఒక వర్గానికి చెందిన ఓట్లను తొలగించేందుకు కుట్రలు

by Ajay Maddhiboyina |

బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో ఒక వర్గానికి చెందిన ఓట్లను తొలగించేందుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేస్తున్నదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు.

బీహార్​లో ఒక వర్గానికి చెందిన ఓట్లను తొలగించేందుకు కుట్రలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో ఒక వర్గానికి చెందిన ఓట్లను తొలగించేందుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేస్తున్నదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్​లో పునర్ నిర్మితమైన సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూం భవన్ ప్రారంభోత్సవం గురువారం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాజా ప్రసంగిస్తూ బీహార్​మాదిరిగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కేరళ తదితర ఏ రాష్ట్రంలోనైనా ఓటర్లను తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజలు, ప్రజాస్వామ్య పార్టీలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దేశంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించి నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ బద్ధమైన ఎన్నికల కమిషన్ చర్యలు ఓటర్లకు ప్రమాదకరంగా మారాయన్నారు. అందుకే బీహార్ ప్రత్యేక సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్స్​వస్తున్నాయన్నారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడి ముందుకు తీసుకు వెళ్లడానికి లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలు, శక్తులను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని డి.రాజా అన్నారు.

‘‘ భారతదేశం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. అనేక క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. కేంద్రంలో మతతత్వ శక్తులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయి. ఆ శక్తులు తమ చేతుల్లో ఉన్న రాజకీయ శక్తిని, ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి అంబేద్కర్ సహా మహానీయులు అందించిన రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు, రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన లౌకిక, ప్రజాస్వామ్య, సంక్షేమ దేశాన్ని మతతత్వ, ఫాసిస్టు శక్తులు దేశాన్ని మతరాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే దేశాన్ని, దేశ చరిత్రను మార్చేందుకు రాజ్యాంగం నుంచి సెక్యులరిజం పదాన్ని తొలగించడమే లక్షంగా పెట్టుకున్నాయి” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన లౌకిక, ప్రజాస్వామ్య, ఫెడరల్ వ్యవస్థలు మతతత్వ ఫ్యాసిస్టుల శక్తుల దాడికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన కార్మిక, ఉద్యోగ దేశవ్యాప్త సమ్మె విజయవంతమైందని, ఇలాంటి ఉధృతమైన పోరాటాలను దేశ ,కార్మికవర్గ, పేదల ప్రయోజనాల కోసం భవిష్యత్తులో కొనసాగించాల్సిన అవసరముందన్నారు. కుల, మత రహిత సోషలిస్టు సమాజ నిర్మాణం కమ్యూనిస్టుల లక్ష్యమని, ఆ లక్ష్యం కోసం, మెరుగైన భారతదేశం కోసం కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతామని ఉద్ఘాటించారు.

విప్లవానికి నిలయం మఖ్ధూంభవన్

పునర్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూభవన్ కేవలం పార్టీ కార్యాలయం కాదని, ఇది తెలంగాణ రాష్ట్రంలో విప్లవానికి నిలయమని, విప్లవ పోరాట కార్యక్రమాలకు, విప్లవోద్యమ సాహిత్యానికి నిలయమని, ఇక్కడికి వచ్చిన కమ్యూనిస్టు శ్రేణులు పోరాట స్ఫూర్తితో ముందుకు వెళతారని డీ. రాజా అన్నారు. కమ్యూనిస్టులు అంటే ఒక జీవన విధానం అని, మానవతావాదులని, ఒక సిద్ధాంతం, ఒక సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు లౌకిక, ప్రజాస్వామ్య శక్తులలో సిపిఐకి మంచి గుర్తింపు ఉండడం అభినందనీయమని ఆయన అన్నారు.

వర్గ దోపిడీ కొనసాగినంత కాలం కమ్యూనిస్టులు ఉంటారు : సురవరం సుధాకర్ రెడ్డి

ప్రపంచంలో వర్గ దోపిడీ కొనసాగినంత కాలం కమ్యూనిస్టులు ఉంటారని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాపంగా నేడు తీవ్ర సంక్షోభంతో పాటు యుద్ద వాతావరణం నెలకొందన్నారు. అమెరికా అధ్యక్షులుగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత యుద్ద ప్రమాదాలు మరింత తీవ్రతరమయ్యాయని తెలిపారు. ఫలితంగా నిరుద్యోగం పెరిగి ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతుండగా, మరోవైపు కార్మికులు, యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీ కొనసాగుతోందన్నారు. ఆ క్రమంలో ప్రపంచంలో పలు దేశాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తుండగా, భారతదేశానికి ఉత్తరాన ఉన్న నేపాల్, దక్షిణాన ఉన్న శ్రీలంకలో కమ్యూనిస్టులు అధికారం చేపట్టడం హర్షనీయమన్నారు. దేశంలోప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఫాసిస్టు పాలన కొనసాగుతుందని, ఇది పూర్తి ఫాసిజమా, పాక్షిక ఫాసిజమా అని చర్చ జరుగుతోందని, అయితే ఈ ప్రభుత్వం మాత్రం ఫాసిజం వైపు వెళుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ బుధవారం జరిగిన సార్వత్రిక సమ్మెలో 25 కోట్ల మంది పాల్గొని నిరసన వ్యక్తం చేశారని, శ్రామిక వర్గానికి తన విప్లవ జేజేలు అని సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై వర్గ పోరాటం చేసి ఎంతో మంది అమరులయ్యారని, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విజయాలను నిలబెట్టేందుకు పోరాటాలను మరింత ముందుకు తీసుకువెళ్ళాలన్నారు. తాము విద్యార్థి నాయకులు ఉన్న సమయంలో నిర్మించిన మగ్ధూంభవన్ 50 ఏళ్ల తర్వాత పునర్ నిర్మితం చేసిన భవనాన్ని తాను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Next Story