- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. ఆ రెండు పార్టీల పొత్తు ఖరారు
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: (Gram Panchayat elections) తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండు కమ్యూనిస్టు పార్టీలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరు పోటీ చేయకుండా ఉండాలని రెండు పార్టీల రాష్ట్ర నాయకత్వం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ సీనియర్ నేతలు చాడ వెంకట్ రెడ్డి, సయ్యద్ అజిత్ పాషా, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటి నరసింహ, సీపీఎం నాయకులు ఎస్. వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, జి. నాగయ్య, అలాగే సీపీఐ కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, వీఎస్ బోస్ పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీలకు జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో రెండు పార్టీలు పరస్పర సహకారంతో కలిసి పనిచేయాలని, పరస్పర పోటీని నివారించాలని నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సీపీఎం రాష్ట్ర నాయకుడు సామినేని రామారావు హత్యకు నెల రోజులు గడిచినా పోలీసులు నిందితులను అరెస్టు చేయలేదని సమావేశంలో అసంతృప్తి వ్యక్తమైంది. కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంపై ఆక్షేపించిన నేతలు, దర్యాప్తును వేగవంతం చేసి, హంతకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని సీపీఐ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.






