- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రీ కంటెంట్‌కు బలి కావొద్దు! డేటా దోపిడీపై సీపీ సజ్జనార్ హెచ్చరికలు ఇవే..
డిజిటల్ యుగంలో డేటా దుర్వినియోగం అనేది పెను ముప్పుగా మారిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: డిజిటల్ యుగంలో డేటా దుర్వినియోగం అనేది పెను ముప్పుగా మారిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం తన ఎక్స్ ఖాతా వేదికగా వ్యక్తిగత డేటా విషయంలో అవగాహన కల్గిస్తూ వరుసగా ట్వీట్‌ల వర్షం కురిపించారు. సమాచారాన్ని తమ ఆయుధంలాగా మార్చుకుని సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు, నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. 'ఇంటర్‌నెట్‌లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే ఉచితంగా కంటెంట్ వస్తుంది, ఎలాంటి లింకునైనా ఓపెన్ చేస్తా, ఎంచక్కా ఎంజాయ్ చేస్తా.' అంటే భవిష్యత్ లో ఎదురయ్యే పరిణామాలను మీరు తప్పక అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. వ్యక్తిగత డేటా.. డబ్బుకంటే విలువైనదన్నారు. ఒక్కసారి అది దుర్వినియోగానికి గురైతే, తిరిగి తెచ్చుకోవడం దాదాపు అసాధ్యమేనని తెలిపారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదని, డేటా విషయంలో తప్పు జరిగిన తర్వాత దాన్ని సరిచేసుకోవడం కష్టంతో కూడుకున్న పని అని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ అంగట్లో వ్యక్తిగత డేటాకు విపరీతమైన డిమాండ్ ఉందని సజ్జనార్ స్పష్టం చేశారు. డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు పలు మార్గాల్లో మన డేటాను తస్కరించి.. నెట్టింట చీకటి ప్రపంచమైన డార్క్ వెబ్‌లో అమ్మేస్తున్నారని హెచ్చరించారు. అక్కడికి వెళ్లిన డేటా ఎక్కడికి చేరుతుందో.. ఎవరి చేతుల్లో పడుతుందో.. మనకు తెలియదు.. అని సూచించారు. సినిమా పైరసీ సైట్లు, ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారంలలోనే ఎక్కువగా డేటా తస్కరణకు గురవుతోందని క్లారిటీ ఇచ్చారు. ఉచిత సినిమాలు.. ఉచిత గేమ్స్.. బోనస్‌లు.. ఇవన్నీ కేవలం డేటాను దోచుకునేందుకు వేసిన ఉచ్చులే అని, ఈ ఉచ్చుల్లో చిక్కుకుంటే మనకు తెలియకుండా మాల్వేర్ ద్వారా మొబైళ్ల నుంచి ఫోటోలు, కాంటాక్ట్స్, బ్యాంకింగ్ వివరాలు, OTPలు అన్ని తస్కరణకు గురవుతాయని హెచ్చరించారు.
తస్కరణకు గురైన డేటాను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు.. మీకు ఫేక్ లింకులు పంపుతారు, ప్రలోభపెట్టే కాల్స్ చేస్తారని సజ్జనార్ తెలిపారు. ఖాతాలు హ్యాక్ చేస్తారు.. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు.. డబ్బులు గుల్ల చేస్తారు.. డిజిటల్ అరెస్ట్‌లు లంటూ వ్యక్తిగతంగా వేధింపులకు దిగుతారు.. ఒక్క క్లిక్‌తోనే మీ మొబైల్‌ను టార్గెట్ చేస్తారు.. అని హెచ్చరించారు. అనుమానాస్పదమైన సైట్లు, యాప్స్.. ఎప్పుడూ క్లిక్ చేయొద్దని సూచించారు. ‘Free movies’, ‘Free downloads’, ‘Free games’ ఇవన్నీ ప్రమాద సంకేతాలన్నారు. ఉచితం అనిపించే ఈ కంటెంట్.. మీకు తాత్కాలిక ఎంజాయ్ ఇచ్చినా, భవిష్యత్తులో జీవితాంతం నష్టాన్ని మిగిల్చే ప్రమాదం పొంచి ఉందన్నారు. మీ డేటా- మీ భద్రత. నమ్మదగిన వెబ్‌సైట్లనే వినియోగించండని సూచించారు. అపరిచిత లింక్‌లు ఓపెన్ చేయొద్దని, మీ ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలని, అనుమానాస్పద యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయాలని సూచించారు.
డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్తగా ఉండటం ఒక ఆప్షన్ కాదు.. మీ భద్రతకు తప్పనిసరి! మీ డేటా.. మీ జీవితానికి సంబంధించిన అంశం.. దాన్ని మీరు కాపాడుకోకపోతే మరెవ్వరూ కాపాడలేరు.. మీ డేటా చోరికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేయండని సూచించారు. లేదా జాతీయ సైబర్ క్రైం పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండని ట్వీట్లలో పేర్కొన్నారు.






