అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే : సీపీ సజ్జనార్

by Ramesh Naini |

నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వర్షాకాలపు సవాళ్లు మరియు ప్రజా భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ. సజ్జనార్ అధ్యక్షతన గురువారం టీజీ-ఐసీసీసీలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో 'కన్వర్జెన్స్ సమావేశం' నిర్వహించారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే : సీపీ సజ్జనార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వర్షాకాలపు సవాళ్లు మరియు ప్రజా భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ. సజ్జనార్ అధ్యక్షతన గురువారం టీజీ-ఐసీసీసీలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో 'కన్వర్జెన్స్ సమావేశం' నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు, హైడ్రా, జలమండలి, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘ముఖ్యంగా పట్టణ నివాసితులు స్వీయ స్వచ్ఛతను పాటించాలని, చెత్త, ప్లాస్టిక్ వస్తువులు, ముఖ్యంగా పాలిథిన్ కవర్లు డ్రైనేజిలో వేయడం మానుకోవాలి. ప్రజలందరు కూడా హైదరాబాద్ పట్టణ శుభ్రతపై దృష్టి సారించాలి’ అని ఉన్నతాధికారులు ముక్తకంఠంతో కోరారు.

సమావేశంలోని ముఖ్యాంశాలు

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ లతోపాటు జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి, టీజీఎస్పీడీసీఎల్ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాటర్ లాగింగ్ పాయింట్లకు పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై చర్చించారు. ప్రధాన జంక్షన్లలో రద్దీని తగ్గించేందుకు రోడ్ల మరమ్మతులు, పెండింగ్‌లో ఉన్న జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవకుండా ఉండేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంపై చర్చించారు. మలక్‌పేట వంటి ప్రాంతాల్లో విజయవంతమైన 'రోబోటిక్ క్లీనింగ్' విధానాన్ని అన్ని వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద అమలు చేయాలని నిర్ణయించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న బస్ స్టాప్‌లను రోడ్డు వెడల్పు ఎక్కువగా ఉన్న చోటికి మార్చడం, రోడ్డు మధ్యలో ఉన్న సులాబ్ కాంప్లెక్సులను తొలగించడం మరియు పాదచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంపై చర్చించారు. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ సౌకర్యాలను మెరుగుపరచడానికి ఇతర స్థలలో కూడా మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయం ఏర్పాట్లు చేయాలని మరియు మల్టీ లెవల్ పార్కింగ్ యాప్" ను తీసుకురావాలని నిర్ణయించినారు.

సమన్వయంతో పనిచేసినప్పుడే : సీపీ సజ్జనార్

జీహెచ్‌ఎంసీ కమిషనర్ వివిధ శాఖలతో సమన్వయ సమావేశాలను పునః ప్రారంభించడంపై సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. ‘పోలీస్, మున్సిపల్ విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి’ అని పేర్కొన్నారు.

అధికారాలు, బడ్జెట్ బదిలీ చేస్తాం: జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్

వాటర్ బోర్డు, విద్యుత్ మరియు ఇతర స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. క్షేత్ర స్థాయి అధికారులకు అధికారాలను, బడ్జెట్‌ను బదిలీ చేస్తామని, దీనివల్ల క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. ప్రతి నెలా క్షేత్రస్థాయి సందర్శనల ద్వారా 80 శాతం సమస్యలను పరిష్కరించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమస్యలను స్వల్పకాలిక (15 రోజులు), మధ్యకాలిక (1-3 నెలలు), దీర్ఘకాలిక (3 నెలల పైబడి) అని వర్గీకరించి పరిష్కరిస్తామన్నారు. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, పార్కింగ్ సౌకర్యాలను మెరుగుపరచడానికి ‘మల్టీ లెవల్ పార్కింగ్ యాప్’ ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాయని వెల్లడించారు. ఈ యాప్ ద్వారా వాహనదారులు తమకు సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించే అవకాశం కలుగుతుంది.

వాటర్ లాగింగ్ పాయింట్లకు శాశ్వత పరిష్కారం : హైడ్రా కమిషనర్ రంగనాథ్

వర్షాకాలంలో నీరు నిలిచే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపుతామని, ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దీంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి అవకాశముందన్నారు.

ట్రాఫిక్ సమస్యపై ఫోకస్ : ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్

నగరంలో ట్రాఫిక్ సమస్యలపై ఫోకస్ పెట్టినట్టు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ సీపీ జోయల్ డేవిస్ అన్నారు. బస్టాపుల పునర్వ్యవస్థీకరణ అవసరమని, సామాన్య ప్రజలకు మరియు వాహనదారులకు అంతరాయం కలగకుండా బస్టాపులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ రద్దీకి కారణమవుతున్న బస్టాండ్‌లను రోడ్డు వెడల్పు ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు మార్చడం ద్వారా సమస్యను తగ్గించవచ్చన్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైనే నిర్మించిన సులబ్ కాంప్లెక్సుల వల్ల ట్రాఫిక్ కు ఆటంకం కలుగుతోందని, వీటిని గుర్తించి అనువైన ఇతర ప్రదేశాలకు తరలించాలని సూచించారు.

పాదచారులు నేరుగా రోడ్లపై నుంచి దాటడం వల్ల ట్రాఫిక్ వేగం తగ్గుతోందని, కావున, అవసరమైన చోట ఫుట్ ఓవర్ బ్రిడ్జులను నిర్మిస్తే వాహనాల రాకపోకలు సులువుగా సాగుతాయని తెలిపారు. ఇటీవల వర్షాకాలంలో మలక్‌పేట వంటి వాటర్ లాగింగ్ (నీరు నిలిచే) పాయింట్ల వద్ద చేపట్టిన 'రోబోటిక్ క్లీనింగ్' మంచి ఫలితాలను ఇచ్చిందని, ఇదే విధానాన్ని నగరం అంతటా అమలు చేస్తే మేలవుతుందని సూచించారు.

పురానాపూల్, బహదూర్‌పురా, ఎం.జే. మార్కెట్, మాసాబ్ ట్యాంక్, బేగంపేట వంటి ప్రదేశాలలో రోడ్డు మధ్యలో రేలింగ్ లేకపోవడం వల్ల పాదచారులు, వాహనదారులు విచ్చలవిడిగా రోడ్డు దాటుతున్నారని, దీంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాలను నివారించడానికి మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఈ ప్రాంతాల్లో రేలింగ్ ఏర్పాటు చేయాలన్నారు.

ఉస్మానియా ఆసుపత్రితో పాటు నగరంలోని ఇతర స్థలాలలో ఆటోలను విచ్చలవిడిగా పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోందని, ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక స్థలాలను ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

వెంటనే ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలి : సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ గజరావు భూపాల్

రోడ్డు తవ్వకాలు జరిపినప్పుడు ప్యాచ్ వర్క్ ఆలస్యం కాకుండా ఉండేందుకు, తవ్వకం మరియు మరమ్మతు పనులను ఒకే కాంట్రాక్టరుకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. రోడ్ల తవ్వకాల సమయంలో ప్యాచ్ వర్క్స్ చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశముందన్నారు.

సీవరేజ్, డ్రైనేజీ వ్యవస్థపై ఫోకస్ : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి

హైదరాబాద్ నగరంలోని ‘సీవరేజ్, డ్రైనేజీ’ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. అన్ని శాఖలు కలిసి పనిచేసినప్పుడే ట్రాఫిక్, పాదచారుల సమస్యలు తీరుతాయని, తమ శాఖ తరపున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ట్రాఫిక్ డీసీపీలు, హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, కంటోన్మెంట్, హైడ్రా, జలమండలి, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story