మత్తు మహమ్మారిని ఏరిపారేస్తాం.. రౌడీ షీటర్ల మాదిరి వారిపై కూడా నిఘా.. సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

డ్రగ్స్ కట్టడికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

మత్తు మహమ్మారిని ఏరిపారేస్తాం.. రౌడీ షీటర్ల మాదిరి వారిపై కూడా నిఘా.. సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: డ్రగ్స్ కట్టడికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో అత్యున్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐబీ, డీఆర్‌ఐ, ఎన్‌సీబీ, ఎక్సైజ్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, ఈగల్, ఎఫ్‌ఆర్‌ఆర్‌వో తదితర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మత్తు మహమ్మారిని ఏరిపారేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లపై ఎటువంటి నిఘా ఉంచుతామో.. డ్రగ్స్‌ నేరగాళ్లు, పెడ్లర్లపైనా అదే స్థాయి నిఘా పెడుతున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌కు చెక్ పెట్టేందుకు 'హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌' (హెచ్-న్యూ)ను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న బృందాలకు అదనంగా మరో నాలుగైదు కొత్త బృందాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన అనేది ఒక్కరోజుతో ముగిసే ప్రక్రియ కాదని, అది నిరంతర పోరాటం అని వెల్లడించారు. ఈ క్రమంలో అన్ని విభాగాలు పరస్పర సహకారంతో పనిచేయాలని ఈ సమావేశంలో సూచించినట్లు తెలిపారు. ఇకపై ప్రతినెలా అన్ని ఏజెన్సీలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, కేసుల పురోగతిని సమీక్షిస్తామని పేర్కొన్నారు.

Next Story