పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageshwar Rao) అన్నారు.

పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageshwar Rao) అన్నారు. ఇవాళ ఆయన సచివాలయంలో ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం, మంచిర్యాల, కామారెడ్డి, నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ రైతులతో మంత్రి తుమ్మల మాట్లాడి వారి సందేహాలు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. పత్తి తేమ శాతం 20 వరకు ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని తాము కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ చౌహాన్‌ (Giriraj Singh Chowhan)కు విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ (CCI) ద్వారా 318 జిన్నింగ్ మిల్లులు నోటిఫై చేసి పత్తి కొనుగోళ్లకు ప్రారంభించామని అన్నారు.

కాగా, నిన్న 72 జిన్నింగ్ మిల్లులలో 784 మంది రైతులకు చెందిన 1,623 మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు చేశామని తెలిపారు. పత్తి క్వింటాలు మద్దతు ధర రూ.8,110 చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. తేమ శాతం విషయంలో పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘కపాస్ కిసాన్’ యాప్‌లో పత్తి రైతులు నమోదు చేసుకుని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలన్నారు. పత్తి కొనుగోళ్లలో సమస్యలంటే రైతులు టోల్ ఫ్రీ నెంబర్‌ 1800 599 5779కు సంప్రదించాలని అన్నారు. అదేవిధంగా నేటి నుంచి సోయాబీన్ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, ప్రైస్ సపోర్ట్ స్కీమ్‌లో మొక్కజొన్న, జొన్నలు చేర్చాలని సోయా‌పై ఉన్న పరిమితులు ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

Next Story