ఉస్మానియా హాస్పిటల్‌లో ప్రతి సేవకూ రేటు!

by Ajay Maddhiboyina |

పేదల పాలిట ధర్మాస్పత్రిగా గుర్తింపు పొందిన ఉస్మానియా ఆస్పత్రిలో శానిటేషన్, పేషంట్ కేర్ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

ఉస్మానియా హాస్పిటల్‌లో ప్రతి సేవకూ రేటు!
X

దిశ , హైదరాబాద్ బ్యూరో /కార్వాన్ : పేదల పాలిట ధర్మాస్పత్రిగా గుర్తింపు పొందిన ఉస్మానియా ఆస్పత్రిలో శానిటేషన్, పేషంట్ కేర్ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇక్కడికి వైద్య చికిత్సల నిమిత్తం వచ్చిన రోగులను వీరు జలగల్లా పట్టి పీడీస్తున్నారు. ప్రతి పనికో రేటు ఫిక్స్ చేసి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇవ్వని వారి పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. వారి చేయి తడపందే ఎలాంటి అవసరమున్నా రోగుల వైపు కన్నెత్తి చూడడం లేదు. చేతిలో డబ్బులు లేవంటే ఆన్ లైన్ లో పంపండి అంటూ డిమాండ్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు . ఇదంతా ఆస్పత్రి అధికారులకు తెలిసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి.

1168పడకల సామర్థ్యం

1168 పడకల సామర్థ్యం గల ఉస్మానియా ఆస్పత్రికి ప్రతినిత్యం వేల సంఖ్యలో రోగులు వస్తుంటారు. వీరిలో అవసరమున్న వారిని ఇన్ పేషంట్లుగా చేర్చుకుని వైద్య సేవలు అందిస్తుంటారు. ఇలా ఇన్ పేషంట్లుగా చేరిన రోగుల నుంచి సెక్యూర్టీ, పేషంట్ కేర్ సిబ్బంది అక్రమ వసూళ్లకు తెరలేపుతుండడం రోగులు, వారి సహాయకులను ఆందోళనకు గురి చేస్తోంది .

మితిమీరుతున్న క్యూపీఎంఎస్ ఆగడాలు...?

ఉస్మానియా ఆస్పత్రిలో పలు విభాగాల్లో సేవల కోసం పనులు దక్కించుకున్న క్యూపీఎంఎస్ సంస్థ సిబ్బంది ఆగడాలకు అంతేలేకుండా పోతోందనే ఆరోపణలు వినబడుతున్నాయి. ముఖ్యంగా రోగులకు సేవలు అందించే విషయంలో వీరు చేస్తున్న వసూళ్ల దందాకు తెర ఎప్పుడు పడుతుందా ? అని ఎదురు చూసే పరిస్థితి వచ్చిందంటే వారి వసూళ్ల బాగోతం ఎలా ఉందో అర్థం అవుతోంది . ప్రభుత్వ ఆస్పత్రిలో పేద రోగులకు ఉచితంగా వైద్యంతో పాటు సేవలు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి యేటా కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం ఉండడం లేదు. చారిత్రాత్మక ఉస్మానియా హాస్పిటల్ లో సెక్యూర్టీ, శానిటేషన్, పేషంట్ కేర్ తదితర విభాగాల పనులకు సంబంధించి క్యూపీఎంఎస్ అనే సంస్థ పనులు దక్కించుకుంది. ఈ సంస్థకు చెందిన యజమాని ఏపీకి చెందిన ఓ మాజీ ఎంపీ కావడంతో ఆయన పేరు చెప్పి ఆయా విభాగాల్లో పని చేసేవారు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి .

పేరుకే నోటీసు బోర్డులు...?

ఉస్మానియా ఆస్పత్రిలోని పలు వార్డుల్లో ఇది ప్రభుత్వ ఆస్పత్రి ఇక్కడ ఎవరు డబ్బులు అడిగినా ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేయమని రాసి ఉన్న బోర్డులు పేరుకే కనిపిస్తున్నాయి. ఇక్కడ పని చేసే ఏ సిబ్బంది ఈ బోర్డులను పట్టించుకోరు. ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు రౌండ్స్ వేసే సమయంలోనే వీరు క్రమశిక్షణతో పని చేస్తున్నట్లు కనబడుతున్నారు. తర్వాత షరా మామూలే. రోగులకు వసూళ్ల వాతలు తప్పవు. ముఖ్యంగా కొన్ని వార్డుల్లో డ్యూటీలు చేసేందుకు చాలా మంది పోటీ పడుతుండగా వీరికి డ్యూటీలు వేసే సూపర్ వైజర్లు సైతం అవినీతికి పాల్పడుతున్నారని తెలిసింది.

ప్రతి సేవకు ఓ రేటు...?

ఉస్మానియా ఆస్పత్రిలో చేరిన ఇన్ పేషంట్ల నుంచి క్యూపీఎంఎస్ పరిధిలో పని చేస్తున్న సిబ్బంది అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. పేదల అందించే ప్రతి చిన్న పనికి రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. గత నెల 26వ తేదీన ఓ 60 యేండ్ల వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఉస్మానియా ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు పరీక్షించి ఆమెను అడ్మిట్ చేశారు. ఇన్ పేషంట్ గా చేరిన సదరు మహిళకు డైపర్ మార్చాల్సి రావడంతో పేషంట్ కేర్‌లో పని చేస్తున్న మహిళా సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారు . దీంతో గత్యంతరం లేక ఆ మహిళా రోగి తన కుమారుడికి ఫోన్ చేసి పేషంట్ కేర్ మహిళా సిబ్బంది భర్త అకౌంట్‌కు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపిన తర్వాతే ఆమెకు డైపర్ మార్చారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. పేషంట్ కేర్ విభాగంలో పని చేసే వారు ప్రతిరోజు కనీసం వేల రూపాయలు ఇలా రోగుల నుండి వసూలు చేయందే డ్యూటీ దిగరనే టాక్ వినబడుతోంది . ఇక్కడ ప్రతి పనికి రూ రూ.50నుండి రూ.500వరకు రేటు నిర్ణయించి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. కొంతమంది పేద రోగులు డబ్బులు లేక అప్పు చేసి మరీ వీళ్ల చేతిలో పెడుతున్నారు . ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగులు, వారి సహాయకులు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను కోరుతున్నారు .

చర్యలు తీసుకుంటాం..

- డాక్టర్ జయకృష్ణ, సీఎస్ ఆర్ఎంవో

హాస్పిటల్‌లో ఇలాంటివి ఎంత మాత్రం సహించం. డబ్బులు డిమాండ్ చేస్తున్న వారిని గుర్తించి విధుల నుండి తొలగిస్తాం. పేద రోగులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్ లో పునరావృతం కాకుండా చూస్తాం.

Next Story