కార్పొరేట్ ఫెయిల్.. సర్కారు సక్సెస్! ఉస్మానియాలో తొలి ‘మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్’

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-03 02:23:11  IST  )

కార్పొరేట్ ఆస్పత్రులు చేతులెత్తేసిన కేసులో ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అద్భుతం సృష్టించారు.

కార్పొరేట్ ఫెయిల్.. సర్కారు సక్సెస్! ఉస్మానియాలో తొలి ‘మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్’
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ వైద్యుల దినోత్సవం రోజున ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం సృష్టించిన మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్ రికార్డు వెనుక ఒక షాకింగ్ నిజం వెలుగుచూసింది. దేశంలోనే తొలిసారిగా ఒకే రోగికి ఐదు అవయవాలను మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన ఈ కేసులో.. ప్రభుత్వ వైద్యాన్ని తక్కువగా చూసే వారికి గట్టి సమాధానం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇలాంటి అరుదైన సర్జరీలు కేవలం 8 మాత్రమే చేస్తే అందులో ఉస్మానియా వైద్యులు చేసిన అరుదైన లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కేసు ఒకటి. లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసే కార్పోరేట్ ఆస్పత్రులకు సాధ్యం కానిది ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిజం చేసి చూపించారు. ఉస్మానియా వైద్యుల ఘనతపై సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయం సైతం ఆరా తీసిందని వైద్యులు తెలిపారు.

సవాల్‌గా స్వీకరించి సక్సెస్..

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో కుటుంబ సభ్యులు ముందుగా నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. అక్కడ భారీ ఖర్చుతో నాలుగు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ, పరిస్థితి మెరుగుపడలేదు. పలు సమస్యల కారణంగా చిన్నపేగులో 60 శాతం భాగాన్ని తొలగించినప్పటికీ రోగి ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర కడుపునొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలతో అతను ఇబ్బందులు పడ్డాడు. చివరకు ఆ ఆస్పత్రి వైద్యులు ఇక చికిత్స చేయలేమని చెప్పడంతో, కుటుంబం ఇతర అవకాశాల కోసం వెతికింది. ఇంటర్నెట్ ద్వారా ఉస్మానియాలో ఇలాంటి శస్త్రచికిత్స సాధ్యమని తెలుసుకుని అక్కడికి వచ్చారు. కేసు క్లిష్టతను గుర్తించిన ఉస్మానియా గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ బృందాలు దీన్ని సవాల్‌గా స్వీకరించాయి. పరీక్షల్లో చిన్నపేగుతో పాటు జీర్ణవ్యవస్థలోని ఇతర భాగాల్లో కూడా ప్రీ-క్యాన్సరస్ ట్యూమర్లు ఉన్నట్లు బయటపడింది. దీంతో మొత్తం జీర్ణవ్యవస్థ మార్పిడి అవసరమని నిర్ణయించారు. ఇలాంటి శస్త్రచికిత్సలు భారతదేశంలో ఇంతకుముందు జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అరుదుగా మాత్రమే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైద్య బృందం అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్‌ను అధ్యయనం చేసి, అమెరికాలోని క్లీవ్‌లాండ్ క్లినిక్ నిపుణులతో సంప్రదింపులు జరిపింది. బ్రెయిన్ డెడ్ దాత నుంచి సేకరించిన జీర్ణాశయం, డ్యువొడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు వంటి ఐదు అవయవాలను 36 గంటలపాటు నిరంతరాయంగా శ్రమించి విజయవంతంగా మార్పిడి చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ప్రాణం కాపాడలేకపోయిన పరిస్థితిలో, ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉస్మానియా వైద్యులు రోగికి పునర్జన్మ ప్రసాదించారు.

అవార్డుల దిగ్గజాల అసూయే మౌనానికి కారణమా?

ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు పొందిన నగరానికి చెందిన కార్పోరేట్ వైద్యులు.. ఉస్మానియా సాధించిన ఈ చారిత్రాత్మక ఘనతపై కనీసం స్పందించకపోవడంపై వైద్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాము చేయలేని అత్యంత క్లిష్టమైన కేసును ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో విజయవంతంగా చేయడం, అదీ దేశంలోనే మొట్టమొదటి కేసు కావడంతో కార్పోరేట్ల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లుగా అయ్యిందని పలువురు వైద్యులు పేర్కొన్నారు. తమ ఆధునిక హంగులు, వేల కోట్ల బిజినెస్ సామ్రాజ్యాల మధ్య విఫలమైన ఒక శస్త్రచికిత్సను, సాధారణ వసతులు ఉండే ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అసాధారణ నైపుణ్యంతో సక్సెస్ చేసి చూపించడాన్ని జీర్ణించుకోలేకనే కార్పొరేట్ దిగ్గజాలు మౌనం వహిస్తున్నారనే చర్చ సర్వత్రా నడుస్తోంది.

ప్రభుత్వ వైద్య నిపుణులకే అసలైన గౌరవం

కార్పోరేట్ ఆస్పత్రుల వ్యాపార మౌనం ఎలా ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జాతీయ స్థాయి సంస్థ ‘నోటో’ ఉస్మానియా వైద్యుల అంకితభావాన్ని ముక్తకంఠంతో కొనియాడారు. చివరకు పీఎంఓ కార్యాలయం నుంచి సైతం ఈ సర్జరీ జరిగిన తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వ వైద్యుల పనితనాన్ని మెచ్చుకున్నారు. కేవలం లాబీయింగ్‌తో జాతీయ అవార్డులు, గుర్తింపులు తెచ్చుకునే కార్పొరేట్ వైద్యుల కంటే.. పరిమిత వసతులతోనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని బ్రతికించి ప్రభుత్వ రంగానికి కిరీటంగా నిలిచిన ఉస్మానియా డాక్టర్లకే అసలైన అవార్డులకు అర్హులని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Next Story