ప్రాణదాతలకు పట్టాభిషేకం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వినూత్న పథకం

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-09 02:08:53  IST  )

ఒకప్పుడు రోడ్డుపై ప్రమాదం జరిగి బాధితుడు రక్తపు మడుగులో కనిపిస్తే సాయం చేయడానికి సైతం వెనకాడే పరిస్థితి ఉండేది.

ప్రాణదాతలకు పట్టాభిషేకం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వినూత్న పథకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒకప్పుడు రోడ్డుపై ప్రమాదం జరిగి బాధితుడు రక్తపు మడుగులో కనిపిస్తే సాయం చేయడానికి సైతం వెనకాడే పరిస్థితి ఉండేది. ‘అయ్యో పాపం’ అని మనసు ద్రవిస్తున్నా, పోలీసుల విచారణలు, కోర్టుమెట్లు, సాక్ష్యాల పేరుతో ఎదురయ్యే తలనొప్పులకు భయపడి చాలామంది మౌనంగా దారిన వెళ్లిపోయేవారు. ముఖ్యంగా మహిళలు, ఉద్యోగస్తులు ఇలాంటి చిక్కుల్లో పడకూడదని భావించేవారు. ఈ ఆలస్యం కారణంగానే ‘గోల్డెన్ అవర్’(ప్రమాదం జరిగిన మొదటి గంట)లో వైద్యం అందక ఎంతోమంది విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. అయితే ఇకపై ఆ భయాలు అవసరం లేదు. మానవత్వాన్ని చాటుకునే వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర సహకారంతో రాష్ట్ర రవాణా శాఖ రహవీర్ (ఆర్ఏహెచ్-వీఈఈఆర్) అనే వినూత్న పథకాన్ని అమలు చేయనుంది. ‘రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత’ అనే సందేశంతో ఈ పథకాన్ని ప్రజలంతా తెలుసుకుని వినియోగించుకోవాలని రవాణా శాఖ విజ్ఞప్తి చేస్తున్నది.

పథకం ముఖ్య ఉద్దేశం..

రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందేలా ప్రోత్సహించడం, సాధారణ పౌరులు భయపడకుండా ముందుకొచ్చి సహాయం చేసే వాతావరణం కల్పించడం, సాయం చేసినవారికి చట్టపరమైన రక్షణ కల్పించడం ఈ రహ-వీర్ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ప్రమాద బాధితుడి ప్రాణాలను కాపాడిన ప్రతి వ్యక్తికి రూ.25వేల నగదు బహుమతి, ప్రభుత్వ ప్రశంసాపత్రం అందిస్తారు. జిల్లా కమిటీ ఏర్పాటు వివరాలు, ఎంపిక విధానంతోపాటు ఈ పథకానికి విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామని రవాణా శాఖ పేర్కొన్నది.

ఎలా ఎంపిక చేస్తారు?..

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడికి తగిన సహాయం చేసి ఆస్పత్రి తరలించిన వ్యక్తి వివరాలు సంబంధిత పోలీసు అధికారి, ఆస్పత్రి సిబ్బంది ద్వారా నమోదు చేస్తారు. పోలీస్ అధికారి జిల్లా కమిటీకి సిఫార్స్ చేయాలి. జిల్లాస్థాయి కమిటీలో కలెక్టర్ చైర్మన్, ఎస్పీ, జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్లు మెంబర్లుగా, జిల్లా రవాణా శాఖ అధికారి కన్వీనర్‌గా ఉంటారు. జిల్లా కమిటీ ఆమోదం పొందిన అనంతరం అర్హులైన వ్యక్తులను రహ-వీర్‌గా ఎంపిక చేస్తారు. వివరాలను జిల్లా కమిటీ రవాణా కమిషనర్‌కు పంపిస్తారు. ఎంపికైన వారికి రూ.25వేల నగదు బహుమతి, ప్రశంసా పత్రం రవాణా శాఖ ద్వారా అందిస్తారు.

చట్టపరమైన రక్షణ..

సహాయం చేసిన వ్యక్తిని పోలీసు విచారణలు లేదా కోర్టు ప్రక్రియల పేరుతో వేధించరాదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్యసాయం అందించాల్సి ఉంటుంది. పూర్తి చట్టపరమైన రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు చూస్తూ ఉండకుండా, భయపడకుండా ముందుకొచ్చి సహాయం చేయాలని రవాణాశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది. అలా చేసినవారికి ప్రభుత్వం పూర్తి రక్షణతో పాటు గౌరవం కల్పిస్తుందని పేర్కొన్నది.

Next Story