జూబ్లీ‌హిల్స్ అభ్యర్థి ఎంపికపై తర్జనభర్జన.. నైరాశ్యంలో కమలం కేడర్

by Kema Shiva Kumar |

జూబ్లీహిల్స్ ​ఉప‌ఎన్నిక అభ్యర్థి ఎంపిక కమలం పార్టీలో కాక రేపుతున్నది.

జూబ్లీ‌హిల్స్ అభ్యర్థి ఎంపికపై తర్జనభర్జన.. నైరాశ్యంలో కమలం కేడర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్​ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక కమలం పార్టీలో కాక రేపుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు​అభ్యర్థులను ప్రకటించి ప్రచారం సైతం షురూ చేశాయి. అభ్యర్థి ఎంపికపై బీజేపీ నేతలు ఇంకా కుస్తీ పడటంపై పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక అభ్యర్థి ఎంపిక కోసం త్రిసభ్య కమిటీ వేయడం ఏంటని ప్రశ్నించింది. నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించి హైకమాండ్‌తో​చర్చలు జరిపిన తర్వాతే ప్రకటన చేయడం పార్టీ బలహీనతకు సంకేతమని నాయకులు ఆరోపిస్తున్నారు. పార్టీ పెద్దల వ్యవహారం చూస్తుంటే అసలు రెండు పార్టీలను ఢీకొనేలా రాజకీయ వ్యూహాలు ఉంటాయా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

నామమాత్రపు పోటీయేనా..

బీజేపీ పెద్దల తీరు చూస్తుంటే ఉప ఎన్నికల్లో నామమాత్రపు పోటీ చేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆ పార్టీ కింది స్థాయి నాయకులు చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ ఆసక్తి లేన్నట్లుగా వ్యవహరిస్తోందని చెప్పుకుంటున్నారు. అధికార కాంగ్రెస్‌ను గెలిపించేందుకే నాన్చుడి ధోరణి అవలంభిస్తుందని, క్యాడర్‌లో నిరుత్సాహం పెంచేందుకు ఎత్తుగడలు వేస్తున్నదని నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల వేట

బై పోల్‌లో డిపాజిట్ దక్కించుకునేందుకు ఇతర పార్టీలో ఉన్న బలమైన నేత కోసం బీజేపీ వేట మొదలు పెట్టిందని కొందరు ఆరోపిస్తున్నారు. కొందరు నేతలు గతంలో పోటీ చేసిన లంకాల దీపక్‌రెడ్డితో పాటు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పేర్లు పరిశీలించినట్టు తెలిసింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ సైతం ఈ ముగ్గురితో మరో ఇద్దరు పేర్లు సూచించినట్లు సమాచారం.

బొంతు రాంమోహన్‌పై గురి..

మొన్నటి వరకూ కాంగ్రెస్​పార్టీ టికెట్ రేసులో ఉన్న మాజీ మేయర్ బొంతు రాంమోహన్‌ను​బీజేపీలో చేర్చుకోవాలని ఎంపీ అర్వింద్​సూచించినట్లు తెలిసింది. ఆయన గతంలో ఏబీవీపీలో పని చేశాడని, కమలం జెండా మోసిన నాయకుడేనని పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. బొంతును పార్టీ పెద్దలు సంప్రదించి బీజేపీలో చేరేలా చూడాలని అర్వింద్ కోరినట్లు సమాచారం. దీనిపై స్పందించిన బొంతు రాంమోహన్​జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తానన్న మాటల్లో వాస్తవం లేదని, తన అభ్యర్థిత్వంపై ఆ పార్టీలో జరిగిన అంతర్గత చర్చతో తనకు సంబంధం లేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు.

Next Story