- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంట్రవర్సీకి కేరాఫ్ గ్రూప్-1.. పేపర్ లీకులు, కేసులతో అభ్యర్థులు సతమతం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు కేవలం ఒకే ఒక గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు కేవలం ఒకే ఒక గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలైంది. కానీ ఇంతవరకు ఉద్యోగాల భర్తీ మాత్రం జరగలేదు. ప్రతిసారీ ఏదోఒక వివాదం తలెత్తడం, న్యాయం కోసం అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో రిక్రూట్‌మెంట్‌కు బ్రేకులు పడటం రోటీన్ అయ్యింది. ఓసారి ప్రిలిమ్స్ పేపర్ లీక్ అవడంతో పరీక్షలను రద్దు చేశారు. మళ్లీ నిర్వహించిన ఎగ్జామ్స్‌లో రూల్స్ ఫాలో కాకపోవడంతో కోర్టు పరీక్షలను రద్దు చేసింది. అయితే, కాంగ్రెస్ సర్కారు వచ్చాక అదనపు పోస్టులతో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసి తుది ఫలితాలు ఇచ్చే సమయంలో మెయిన్స్ పరీక్షల్లో లోపాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. ఆ కేసును విచారించిన హైకోర్టు రీ వాల్యూయేషన్ చేయాలంటూ తీర్పు ఇవ్వడంతో బ్రేకులు పడ్డాయి.
పుష్కర కాలం వృథా..
రాష్ట్రం ఏర్పడి ఈ ఏడాది డిసెంబరు వస్తే 12 ఏళ్లు పూర్తవుతాయి. కానీ ఈ పుష్కరకాలంలో ఇంతవరకు ఒక్కగ్రూప్–1 పోస్టు భర్తీ చేయలేని దుస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు ఇచ్చిన ఏకైక గ్రూప్–1 నోటిఫికేషన్ చుట్టూ వివాదాలే నడుస్తున్నాయి. రాష్ట్రంలో అత్యున్నత సర్వీస్ అయిన గ్రూప్–1 ఉద్యోగం కోసం లక్షలాది మంది నిరుద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి చదవారు. లక్షల్లో వ్యయం చేసి కోచింగ్ తీసుకుని, తల్లిదండ్రులకు దూరంగా నగరాలు, పట్టణాల్లో ఉంటూ ప్రిపేర్ అయ్యారు. కానీ ప్రతిసారి ఏదో ఒక వివాదం తలెత్తడం, పరీక్షలు రద్దవ్వడం మళ్లీ నిర్వహించడంతో అభ్యర్థుల్లో నిరాశ మొదలైంది. అసలు గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ జరుగుతుందా లేదా? అనే అనుమానం వారిని వెంటాడుతున్నది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఇప్పటివరకు మూడుసార్లు గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి, ఎలాంటి వివాదాలు లేకుండా ఉద్యోగాలను భర్తీ చేశారు. కానీ ఇక్కడ ప్రతిసారీ వివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది.
బీఆర్ఎస్ నోటిఫికేషన్‌లో పేపర్ లీక్..
రాష్ట్రం ఏర్పడిన వెంటనే గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చేందుకు నాటి ప్రభుత్వం చొరవ చూపలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఖాళీల వివరాలను లెక్కలు తీశారు. అయితే, కొత్త జిల్లాలకు రాష్ట్రపతి అమోదం అవసరం ఉండటంతో నోటిఫికేషన్‌కు మరికొంత సమయం పట్టింది. చివరకు 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబరు 16న ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించి, రిజల్ట్ కూడా రిలీజ్ చేశారు. కానీ రాత్రింబవళ్లు కష్టపడి చదివిన వారు సెలెక్ట్ అవలేదు. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకు వచ్చింది. ప్రభుత్వం విచారణకు ఆదేశించగా సర్వీస్ కమిషన్‌లో పనిచేస్తోన్న కొందరు కాంట్రాక్టు ఎంప్లాయీస్ పరీక్ష పత్రాలను దొంగలించి బయటకు విక్రయించారు. దీంతో పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం మళ్లీ ప్రెష్‌గా నోటిఫికేషన్ ఇచ్చి గతంలో దరఖాస్తు చేసుకోలేని నిరుద్యోగులకు సైతం దరఖాస్తు చేసుకునే చాన్స్ కల్పించింది.
రెండో సారి కోర్టు జోక్యంతో రద్దు..
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రూప్-1 ప్రిలిమ్స్ పూర్తి చేయాలని అప్పటి ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. ఎందుకంటే తొలిసారి నిర్వహించిన ఎగ్జామ్స్‌లో పేపర్ లీక్ అవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ అపవాదు నుంచి బయట పడేందుకు 11 జూన్ 2023లో రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించారు. కానీ సర్వీస్ కమిషన్ అందరి అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోలేదు. ఈ విషయంపై కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. కానీ దీన్ని సవాలు చేస్తూ అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈలోపే అసెంబ్లీ ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగాయి. అయితే, సుప్రీంలో ఉన్న పిటిషన్‌ను వెనక్కి తీసుకుని కాంగ్రెస్ సర్కారు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది.
మూడో నోటిఫికేషన్‌లో అడుగడున వివాదాలే..
గతంలో ఉన్న పోస్టులకు అదనంగా 60 పోస్టులు జతచేసి మొత్తం 563 పోస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసింది. 9 జూన్ 2024న ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించి రిజల్ట్ విడుదల చేశారు. అయితే, మెయిన్స్ ఎంపికపై పెద్ద ఎత్తున వివాదం నడిచింది. అభ్యర్థుల ఎంపిక కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 వల్ల బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ ఆందోళనలు నడిచాయి. చివరకు ఆ జీవో సమంజసంగానే ఉందని కోర్టు చెప్పడంతో మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. కానీ, తెలుగు భాషలో మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లడంతో రీవాల్యూవేషన్ చేయాలంటూ న్యాయస్థానం తాజాగా తీర్పు చెప్పింది.
అప్పీల్‌కు వెళ్లేందుకు నిర్ణయం!
మెయిన్స్ జవాబు పత్రాలను మళ్లీ దిద్దాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయాలని సర్వీస్ కమిషన్ భావిస్తున్నది. అందుకోసం న్యాయనిపుణలతో సంప్రదింపులు జరుపుతున్నది. గ్రూప్-1 పరీక్షల్లో ఇప్పటివరకు జరిగిన ప్రక్రియలను వివరించాలని భావిస్తున్నది. ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై పలువురు న్యాయ నిపుణలతో మాట్లాడుతున్నట్టు తెలిసింది.






