- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగణనకు సహకరించండి.. జూన్ 9 వరకు హౌస్ లిస్టింగ్: ఆర్వీ కర్ణన్ కీలక వ్యాఖ్యలు
జనగణనలో భాగంగా సోమవారం నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్న హౌస్ లిస్టింగ్ కార్యక్రమానికి ఎన్యూమరేటర్లకు సహకరించాలని ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జనగణనలో భాగంగా సోమవారం నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్న హౌస్ లిస్టింగ్ కార్యక్రమానికి ఎన్యూమరేటర్లకు సహకరించాలని ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల రూపకల్పనకు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు, అమలుకు జనాభా వివరాలు ఎంతో అవసరమని చెప్పారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, తుది దశలో ఫిబ్రవరి 9, 2027 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు జనగణన జరుగుతుందని తెలిపారు. వివరాలు చెప్పేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదన్నారు. వివరాలు తప్పనిసరిగా చెప్పాల్సిందేనని స్పష్టంచేశారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అడిషనల్ కమిషనర్ బదావత్ సంతోష్ తో కలిసి ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ మాట్లాడారు.
ఓనర్, కిరాయి దారులకు ఇబ్బంది ఉండదు
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) యూనిట్ గానే జనగణన జరుగుతుందని, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఏరియాల్లోని 60 సర్కిళ్ల తోపాటు కంటోన్మెంట్ బోర్డు ఏరియాను ఒక సర్కిల్‌గా భావిస్తున్నామని చెప్పారు. ప్రతి సర్కిల్‌ను ఛార్జ్‌గా భావిస్తున్నామని, ఒక్కో సర్కిల్‌కు ఛార్జ్ ఆఫీసర్‌గా డిప్యూటీ కమిషనర్ వ్యవహరించనున్నారని తెలిపారు. క్యూర్ పరిధిలో 19,868 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ ఉన్నాయని తెలిపారు. ఎన్యూమరేటర్లు 21,773మంది, సూపర్ వైజర్లు 3,402 మంది మొత్తం 25,175 మంది పాల్గొనున్నారని తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్‌లకు ప్రత్యేకంగా ఐడీ కార్డులను అందజేశామని తెలిపారు. జనగణనకు సంబంధించిన వివరాలను ఎక్కడ వినియోగించబడవని, ఎవరికి కూడా షేర్ చేయబడవని, మొబైల్ యాప్ ద్వారా పొందుపర్చనున్నారని తెలిపారు. ఎక్కడా డౌన్లోడ్, అప్ లోడ్ చేయడం ఉండదని స్పష్టం చేశారు. జనగణనలో ఓనర్, కిరాయి దారులకు మధ్య ఏలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.
సెల్ఫ్ ఎన్యూమరేషన్ నామమాత్రమే..
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు నిర్వహించిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ నామమాత్రంగానే జరిగింది. క్యూర్ పరిధిలో 1.27లక్షల కుటుంబాలు మాత్రమే సెల్ఫ్ ఎన్యూమరేషన్ నమోదు చేసుకున్నారని కమిషనర్ ఆర్వీ.కర్ణన్ తెలిపారు.
పలు ప్రాంతాల్లో పరిశీలన..
బంజారాహిల్స్ వార్డులోని ఎన్బీటీ నగర్ లో జనాభా గణనను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ పరిశీలించారు. ఎన్యూమరేటర్లు ఫీల్డ్ మీద చేయుచున్న జనాభా గణన విధానాన్ని, ఎన్యూమరేట్ యాప్ లో ఒక ఫ్యామిలీ వివరాలు నమోదు విధానాన్ని పరిశీలించారు. హబ్సిగూడలో జనగణన పనులను ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి పరిశీలించారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో ప్రత్యక్షంగా మాట్లాడి, ఫీల్డ్ స్థాయిలో నిర్వహిస్తున్న మ్యాపింగ్ ప్రక్రియ, హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ యాప్ వినియోగం, డేటా సేకరణ విధానం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.






