AITUC: 7 నెలలుగా జీతాలు చెల్లించట్లేదు.. డీఎంఈ ఆఫీస్ వద్ద కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది ధర్నా

by Ramesh Naini |

కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని ఏఐటీయూసీ నాయకులు మండిపడ్డారు.

AITUC: 7 నెలలుగా జీతాలు చెల్లించట్లేదు.. డీఎంఈ ఆఫీస్ వద్ద కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది ధర్నా
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంట్రాక్ట్ నర్సింగ్ (Contract nursing) సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని ఏఐటీయూసీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు శనివారం కోఠిలోని డీఎంఈ (DME) కార్యాలయం ముందు టీమ్స్ ద్వారా నియమితులైన వివిధ ఆస్పత్రుల్లో పనిచేయుచున్న కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ యూసుఫ్, ఎం నరసింహులు మాట్లాడుతూ.. నర్సింగ్ సిబ్బందికి 7 నెలలుగా జీతాలు లేకపోవడం వలన వారి కుటుంబాలు వీధిన పడే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి పనులు చేయించుకుంటున్న అధికారులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు కాంటాక్ట్ నర్సింగ్ సిబ్బంది జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతుంటే.. వీరికి జీతాలు ఇప్పించే అధికారులు మాత్రం నత్తనడకన పనులు నిర్వహిస్తూ ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని కల్పిస్తున్నారని అన్నారు.

నర్సింగ్ సిబ్బంది జీతాలు చెల్లించాలని అధికారుల చుట్టూ ఎన్ని సార్లు ప్రదక్షిణలు చేసిన వారికి కనికరం రావడంలేదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ధర్నా కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చిందన్నారు. కాగా, కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించకపోతే డీఎంఈ కార్యాలయం ముందు బైఠాయించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ హైదరాబాద్ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కిషన్, నర్సింగ్ సిబ్బంది నాయకురాలు రజిత, లావణ్య, సుప్రియ, కే శాంతి, రత్న, సుజాత, స్వాతి, విజయలక్ష్మి, స్వప్న, మేఘమాల, సంగీత, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.

Next Story