కేసీఆర్ మార్క్: తాజ్‌మహల్‌‌ను మించిన తెలంగాణ సెక్రటేరియట్ (ఫొటోస్)

by GSrikanth |   (  Updated:2023-04-30 04:30:43  IST  )

ముఖ్యమంత్రి ఏది చేసినా పది కాలాలపాటు గుర్తుండిపోయేలా ఉంటుందని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.

కేసీఆర్ మార్క్: తాజ్‌మహల్‌‌ను మించిన తెలంగాణ సెక్రటేరియట్ (ఫొటోస్)
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి ఏది చేసినా పది కాలాలపాటు గుర్తుండిపోయేలా ఉంటుందని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అది అభివృద్ధి అయినా, సంక్షేమమైనా మొత్తం దేశమే చర్చించుకునేలా ఉంటుందంటారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అప్పుడప్పుడు మాత్రమే సచివాలయానికి వచ్చిన కేసీఆర్.. తన ఆలోచనలకు అనుగుణంగా కొత్త భవనాన్ని రెండేండ్ల వ్యవధిలోనే రాజ ప్రాసాదాన్ని తలపించేలా నిర్మించారు. కొత్త సెక్రటేరియట్​ ఏప్రిల్ 30న లాంఛనంగా ప్రారంభించడానికి ముహూర్తం ఖరారైంది. ఈక్రమంలో ఆ భవనం ఎలా ఉన్నది? అందులో ఏమేమి ఉన్నాయి? లోపలి భాగం ఎలా ఉంటుంది? సౌకర్యాలేంటి? ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాలు ‘దిశ’ పాఠకుల కోసం..

* ఢిల్లీలోని నార్త్, సౌత్ బ్లాకుల నిర్మాణాన్ని గతంలో నిశితంగా అధ్యయనం చేసిన కేసీఆర్ ఆ తరహాలోనే నిర్మించాలని భావించారు.

* 2019 జూన్‌లో శంకుస్థాపన చేశారు.

* సుమారు రూ. 400 కోట్ల ఖర్చుతో కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించే ఉద్దేశంతో పాత భవనాలను ఆ మరుసటి సంవత్సరం నేలమట్టం చేయించారు. = కాకతీయ-డెక్కనీ స్టైల్‌లో చెన్నై నగరానికి చెందిన ఆస్కార్-పొన్ని ఆర్కిటెక్ట్ సంస్థ రూపొందించిన డిజైన్‌ను ఖరారు చేశారు.

* కరోనా కాలంలోనే కొత్త భవనం పనులు మొదలయ్యాయి.

* ఆగ్రా, జైపూర్, ధోల్‌పూర్ నుంచి గోధుమ, ఎరుపు రంగు రాళ్ళను తెప్పించారు.

* నిర్మాణానికి అనుకున్న అంచనా వ్యయం దాదాపు మూడు రెట్లు పెరిగింది.

* అధికారికంగా వెయ్యి కోట్లు కూడా దాటలేదని ఆఫీసర్లు చెప్తున్నా పూర్తిస్థాయిలో ఫర్నీచర్‌తో సహా కొలువుదీరే సమయానికి ఎంత వ్యయం అయిందన్నది తేలుతుంది.

మొత్తం ప్రాంగణం విస్తీర్ణం : 28 ఎకరాలు

భవనం విస్తీర్ణం : 2.6 ఎకరాలు (10 లక్షల చ.అ. పైగా)

అంతస్తులు : మొత్తం 11 అంతస్తులు. సెల్లార్, అండర్ గ్రౌండ్, డోమ్‌లలని ఫ్లోర్లను కలుపుకుని. ఇందులో ఆరు మాత్రమే పాలనకు అవసరం.

ఎంట్రీ పాయింట్లు : తూర్పు వైపు ప్రధాన ద్వారం. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ వైపున మరో రెండు ఎంట్రీ గేట్లు. అత్యవసరం కోసం పశ్చిమం దిశగా మరో ఎంట్రీ.

మెయిన్ ఎంట్రీ : ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సెక్రటరీలు, ప్రజా ప్రతినిధుల కోసం.

నార్త్ ఈస్ట్ ఎంట్రీ : ఈ గేటు ద్వారా సచివాలయం ఉద్యోగులు (మెయిన్ ఎంట్రీ నుంచి అనుమతి లేనివారికి) ఎంటర్ అవుతారు. వీరికి విడిగా టూ-వీలర్, ఫోర్-వీలర్ పార్కింగ్ సౌకర్యం ఉంటుంది.

సౌత్ ఈస్ట్ ఎంట్రీ : విజిటర్లు, కామన్ పబ్లిక్ (అవసరాల కోసం వచ్చేవారు) కోసం ఉద్దేశించింది. వీరి వాహనాలను ప్రాంగణం బైటనే పార్కు చేసుకోవాల్సి ఉంటుంది.

సీఎం కాన్వాయ్ పార్కింగ్ : మెయిన్ ఎంట్రీ ద్వారా సచివాలయంలోకి వచ్చే సీఎం కాన్వాయ్ వాహనాలు వెస్ట్ సైడ్‌లో పార్కింగ్ అవుతాయి.

విశాలమైన సీఎం చాంబర్

బుల్లెట్ ప్రూఫ్‌తో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి చాంబర్ ఉంటుంది. సీఎంఓ కార్యదర్శులు, పేషీ, సిబ్బంది కార్యాలయాలు కూడా ఈ ఫ్లోర్‌లోనే ఉంటాయి. ఈ ఫ్లోర్‌లోకి వెళ్లడానికి విడిగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచే లిఫ్టులు ఉంటాయి. సీఎం చాంబర్‌లో ఒకేసారి కనీసం 30-40 మంది కూర్చుని మాట్లాడేంత సౌకర్యవంతగా రూపుదిద్దుకున్నది. అధికారులతో సమావేశాలు నిర్వహించడానికి దీనికి పక్కనే మీటింగ్ హాల్ ఉంటుంది. ఒకేసారి అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యేలా విశాలంగానే ఉంటుంది. ఆడియో, విజువల్ ప్రెజెంటేషన్ కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉంటాయి.

క్యాబినెట్ మీటింగ్ హాల్

మంత్రివర్గ సమావేశాలను నిర్వహించడానికి ప్రత్యేకంగా క్యాబినెట్ మీటింగ్ హాల్ ఉంటుంది. ఇందులో మంత్రులతో పాటు ఆయా శాఖల అధికారులు కూడా పాల్గొనే వీలు ఉంటుంది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు తరహాలో దీర్ఘ చతురస్రాకారంలో టేబుల్, కుర్చీలు ఉంటాయి. పాలరాతి రంగులోని ఇంటీరియర్‌తో మనసుకు ఆహ్లాదకరంగా ఉండేలా రూపుదిద్దుకున్నది.

బాంక్వెట్ హాల్

సమావేశాల సందర్భంగా హాజరయ్యే మంత్రులు, అధికారులు అక్కడే భోజనం చేయడానికి వీలుగా బాంక్వెట్ హాల్ ఉంటుంది. ఒకేసారి ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి భోజనం చేసే విశాలమైన డైనింగ్ టేబుల్‌తో పాటు అధికారులకు సైతం అదే హాల్‌లో రౌండ్ డైనింగ్ టేబుళ్లు ఉంటాయి. స్టార్ హోటళ్లలో కనిపించే లైటింగ్, ఇంటీరియర్ డిజైన్, షాండిలియర్ కాంతులు, గోడలకు ఆకర్షణీయమైన పెయింటింగ్ లాంటివి ఉంటాయి.

ఆడిటోరియం

సచివాలయంలోనే ఒక విశాలమైన ఆడిటోరియం కూడా ఏర్పాటైంది. డెవలప్‌మెంట్, వెల్ఫేర్ స్కీమ్‌లకు సంబంధించిన లఘు చిత్రాలను మంత్రులు, అధికారులు కలిసి వీక్షించేలా 200 మంది కెపాసిటీతో కొలువుదీరింది. దేశ, విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రగతి, ఖ్యాతిని వివరించడానికి కూడా దీన్ని వాడుకునే ఆలోచనతో రపుదిద్దుకున్నది.

స్కై లాంజ్

అంతర్జాతీయ ప్రతినిధులతో జరిగే విస్తృత సమావేశాలు, ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి లాంటి అతిథులు వచ్చినప్పుడు మాట్లాడడానికి ప్రత్యేకంగా స్కై లాంజ్ ఉంటుంది. సెక్రటేరియట్‌లోని ఆరు అంతస్తుల్లో ఆఫీసర్లు, సిబ్బంది పనులకు ఇబ్బంది లేకుండా, గెస్టులకు భద్రతాపరమైన చిక్కులు రాకుండా ప్రత్యేకంగా తూర్పు, పడమరవైపు ఉండే పెద్ద డోమ్‌లలో ఇవి ఏర్పాటయ్యాయి.

హెలిపాడ్

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు నేరుగా హెలికాప్టర్‌లో సచివాలయానికి చేరుకునేలా హెలిపాడ్ సౌకర్యం కూడా ఉన్నది. ఉత్తరంవైపు కార్ల పార్కింగ్ దగ్గర ఏర్పాటైన హెలిపాడ్‌లో దిగిన వెంటనే మెయిన్ ఎంట్రీ లేదా నార్త్ ఎంట్రీ ద్వారా నేరుగా ఆరో అంతస్తు లేదా స్కై లాంజ్‌లోకి 8 లిఫ్టుల ద్వారా వెళ్లే వీలు ఉంటుంది.

తాజ్‌మహల్‌ కంటే ఎక్కువ ఎత్తు

మొత్తం 11 అంతస్తుల (డోమ్‌లతో కలుపుకుని)తో నిర్మాణమైన సచివాలయం ఎత్తు 265 అడుగులు. ఆగ్రాలోని తాజ్‌మహల్‌కంటే పాతిక అడుగులు ఎక్కువే. కుతుబ్‌మినార్‌కంటే కూడా ఎక్కువ ఎత్తు ఉంటుంది. నిర్మాణ పటిష్టత కోసం భవనం ఫౌండేషన్‌ నుంచే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. గాల్వనైజ్డ్ రీఇన్‌ఫోర్స్ కాంక్రీట్ టెక్నాలజీని ఇంజినీర్లు వినియోగించారు. ఈ పిల్లర్ల నిర్మాణానికే ఆరు నెలలకు పైగా సమయం పట్టింది. వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకునే విధంగా భవనం నిర్మాణమైంది.

ఆరంతస్తులు.. 635 గదులు

ముఖ్యమంత్రి చాంబర్ మొదలు స్కై లాంజ్, డైనింగ్ హాల్స్, మంత్రులు, వారి కాన్ఫరెన్సు హాళ్లు, కార్యదర్శుల చాంబర్లు, పేషీలు మొత్తం 635 గదులు సచివాలయంలో ఉన్నాయి. రోజువారీ కార్యకలాపాలు వీటిలోనే జరుగుతాయి. ప్రతి అంతస్తు 14 అడుగుల ఎత్తుతో వెంటిలేషన్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణమయ్యాయి. భవనం మొత్తానికి 24 చాంబర్లు, 24 లిప్టులు ఉన్నాయి. వేలమంది సిబ్బంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఐదున్నర లక్షల లీటర్ల స్టోరేజీ సౌకర్యం, సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం పార్కింగ్ స్లాట్లలో సోలార్ ప్లేట్స్ ఉంటాయి.

నిఘా వ్యవస్థ

భవనం చుట్టూ మూడంచెల భద్రత ఉంటుంది. రోడ్డు మీద స్పెషల్ ఇంటెలిజెన్స్ నిఘా ఉంటు,ది. భవనానికి నాలుగు దిక్కులా 24 గంటలూ పనిచేసే హై రిజొల్యూషన్ సీసీటీవీ కెమెరాలు 300 పనిచేస్తూ ఉంటాయి. వీటిని మానిటర్ చేయడానికి ఆరో అంతస్తు పైన ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. సెక్యూరిటీ కోసం మూడు బెటాలియన్లకు చెందిన 300 మంది స్పెషల్ పోలీసులు ఉంటారు.

సౌత్ సైడ్ రిసెప్షన్

సచివాలయానికి సందర్శకులు ఎవరు వెళ్లాలన్నా సౌత్ సైడ్ నుంచి మాత్రమే అనుమతి. తొలుత రిసెప్షన్ హాల్‌లో పేరు నమోదు చేసుకుని ఆ తర్వాత భవనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం స్మార్ట్ కార్డ్ ఎంట్రీ వ్యవస్థ ఉంటుంది. బ్యాటరీ వెహికిల్స్ ద్వారా వెళ్లాలి. విజిటర్స్ కు ఇది మాత్రమే ఏకైక ఎంట్రీ. పబ్లిక్ యుటిలిటీస్ కోసం బ్యాంకు, ఏటీఎం, పోస్టాఫీసు, రైల్వే-బస్ టికెట్ కౌంటర్లు, క్యాంటీన్.. ఇలాంటివన్నీ ఉంటాయి.

పశ్చిమం దిశగా ప్రార్థనా మందిరాలు

సచివాలయ ప్రాంగాణానికి వెలుపల పశ్చిమం దిశగా నల్లపోచమ్మ ఆలయం, చర్చి, రెండు మసీదులు, గురుద్వారా ఉంటాయి. వీటికి పక్కనే సెక్యూరిటీ సిబ్బంది, వివిధ ఉద్యోగ సంఘాల ఆఫీసులు, డిస్పెన్సరీ, పిల్లలకు క్రెచ్, ఇండోర్ గేమ్స్ హాల్, డ్వాక్రా సంఘాల స్టోర్.. ఇలాంటివి ఉంటాయి. మింట్ కాంపౌండ్ దిశ నుంచి ఎంట్రీ కావడానికి వీలుంటుంది. సచివాలయంతో సంబంధం లేకుండా విభజనగా ఎత్తయిన ప్రహరీ గోడ ఉంటుంది.





























Next Story